కేంద్ర బడ్జెట్: అమరావతికి భూములిచ్చిన 24 వేల మందికి వరం
ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ ఇస్తున్నామని కొంతలో కొంత ఊరట కలిగించే మాటలు మాట్లాడింది. ఈ నేపథ్యంలో అందరి చూపు జైట్లీ కేంద్ర బడ్జెట్ పైన ఉంది.
విజయవాడ: ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఏపీకి మొండిచేయి చూపింది. అంతకుమించి ప్యాకేజీ ఇస్తున్నామని కొంతలో కొంత ఊరట కలిగించే మాటలు మాట్లాడింది. అమరావతికి భూముల ఇచ్చిన రైతులకు మాత్రం వరం ప్రసాదించింది

అమరావతి ప్రాంతంలో ఏపీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇస్తున్నట్లు జైట్లీ ప్రకటించారు. రాజధాని నిర్మాణం కోసం అత్యంత వినూత్నంగా భూసమీకరణ జరిగిందని ఆయన ప్రశంసించారు. రాజధాని రైతులు తమ వాటాగా పొందే వాణిజ్య, నివాస ప్లాట్లను తొలిసారి విక్రయించగా వచ్చే సొమ్ముపై పన్ను (క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
భూసమీకరణలో తమ పొలాలను ఇచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మెట్టకు ఎకరానికి వెయ్యి గజాల రెసిడెన్షియల్ ప్లాటు, 250 గజాలు వాణిజ్య ప్లాటు చొప్పున కేటాయించింది. అదే జరీబు భూములు ఇచ్చిన వారికి వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల కమర్షియల్ ప్లాటు ఇస్తోంది. రాజధాని రాకతో స్థలాల విలువ భారీగా పెరుగుతుందని, తమ వాటా ప్లాట్లు విక్రయించుకోవడం ద్వారా రైతులకు భారీ లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ప్లాట్ల తొలిసారి విక్రయం (ఫస్ట్ సేల్) ద్వారా వచ్చిన డబ్బుపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయించాలని రాజధాని రైతులు మొదటి నుంచి కోరుతున్న విషయాన్ని గత ఏడాది అక్టోబరులో అమరావతి పరిపాలనా నగరం, 7 కీలక రహదారుల శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించేందుకు రాజధాని ప్రాంతానికి వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలియజేశారు.
వారి వాదనను శ్రద్ధగా విన్న జైట్లీ... ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. తాను ఢిల్లీకి వెళ్లగానే ఈ ప్రతిపాదనను చురుగ్గా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. కాగా, క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను మినహాయించాలంటే ప్రత్యేకంగా చట్టం తేవాల్సి ఉంటుందని కూడా అప్పట్లో జైట్లీ చెప్పారు. అయితే, కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో, క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను మినహాయింపును బడ్జెట్‌లో పెట్టారు.
ఈ క్యాపిటల్ గెయిన్ మినహాయింపు వల్ల 24 వేల మంది రైతులు ప్రయోజనం పొందుతారని ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు.












Click it and Unblock the Notifications