ఏపీకి కేంద్రం భారీ వరాలు: రెండు కీలక ప్రాజెక్టులు, గోదావరిపై మరో వంతెన..!!
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. లోక్ సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిన తర్వాత జరిగిన కేబినెట్ కావటంతో.. నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగింది. మహిళా రిజర్వేషన్లు అమలు కాకుండా విపక్షాలు వ్యవహరించిన తీరు సరికాదని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదే సమయంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఏపీ కేంద్రంగా భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ తాజా నిర్ణయంతో ఏపీకి ప్రయోజనం కలగనుంది.
కేంద్ర కేబినెట్ సమావేశంలో తాజాగా పార్లమెంట్ లో చోటు చేసుకున్న అంశాల పైన చర్చించారు. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. మహిళా బిల్లు అడ్డుకున్న విపక్షాలు సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లు అమలుకు తాము ముందుకు వచ్చామని.. విపక్షం అడ్డుపడిందని పేర్కొన్నారు. కాగా, ఈ కేబినెట్ లో రాజమండ్రి-విశాఖ మధ్య మరో రెండు రైల్వే లైన్ల నిర్మాణం రూ.9,889కోట్లతో చేపట్టేందుకు ఆమోదం లభించింది. నిడదవోలు-దువ్వాడను కలుపుతూ రైల్వే లైన్లు నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు కనెక్టివిటీకి ఆమోదం లభించింది. ఇక, పోర్టుల కనెక్టివిటీకి రూ.9,889 కోట్లు కేటాయింపులు చేసారు. 198 కిలోమీటర్ల మేర కారిడార్ ఏర్పాటు కు నిర్ణయించారు. గోదావరిపై 4.3 కి.మీ మేర వంతెన నిర్మాణానికి ఆమోద ముద్ర వేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

కేబినెట్ నిర్ణయాలు
కాగా, గాజియాబాద్-సీతాపుర్ మధ్య మూడు, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సావరిన్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటుకూ కేబినెట్ ఆమోదించింది. రూ.13వేల కోట్లతో ఆ నిధిని ఏర్పాటు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రెండు శాతం మేర డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక, సావరిన్ మారిటైమ్ పండ్ ద్వారా భారత జెండా ఉండే నౌకలతోపాటు భారత్ నుంచి రాకపోకలు సాగించే నౌకలకు బీమా కవరేజీ లభిస్తుంది. పశ్చిమా సియా యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధిలో సరకు రవాణా నౌకలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిధిని ఏర్పాటు చేసింది. కేంద్ర ఉద్యోగులకు తాజాగా డీఏ పెంపుతో ప్రస్తుతం ఉన్న 58 శాతం డీఏ 60 శాతానికి చేరనుంది.ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనను 2028 వరకు పొడిగించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.













Click it and Unblock the Notifications