మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలి - త్వరలోనే నీటి వివాదాల పరిష్కారం : అమిత్ షా..!!
మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రులు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సూచించారు. దక్షిణాది ప్రాంతీయ మండలి (సదరన్ జోనల్ కౌన్సిల్) సమావేశంలో అమిత్‌షా ముఖ్యమంత్రులకు పలు కీలక సూచనలు చేసారు. మాదకద్రవ్యాల వినియోగం జీవితాల్ని నాశనం చేస్తోందని.. యువతను నిర్వీర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసారు. మహిళలు, బాలలపై జరిగే నేరాల దర్యాప్తును 60 రోజుల్లోగా పూర్తి చేయాలన్న నిబంధనను కచ్చితంగా పాటించాలని చెప్పారు.

కేంద్రానికి నివేదిక ఇవ్వాలి
పోక్సో చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని, ఆ నేరాలను ఏ మాత్రమూ ఉపేక్షించొద్దని స్పష్టం చేసారు. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల సవరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ సవరణల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి నివేదికలివ్వాలి. విచారణల వేగవంతానికి రాష్ట్రాలు 'డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్' స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలి' అని సూచించారు. ప్రధాని మోదీ చొరవతో ఇప్పటికే జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యాయని అమిత్‌షా చెప్పారు.

ఫోరెన్సిక్ కళాశాల ఏర్పాటు చేయాలి
ప్రతి రాష్ట్రం కనీసం ఒక్క ఫోరెన్సిక్ సైన్స్ కళాశాలనైనా ఏర్పాటు చేయాలని, వాటిలో సిలబస్ స్థానిక భాషలో ఉండాలన్నారు. కొవిడ్‌ను నియంత్రించే స్థాయి భారత్‌కు లేదని అంతా భావించారు. అయితే.. ప్రధాని మోదీ నాయకత్వంలో మహమ్మారి నివారణలో మన సత్తా చాటాం. కరోనా నియంత్రణకు 111 కోట్ల డోసుల టీకాలు వేయడం సమాఖ్యవాద విజయానికి ఉదాహరణ అని అమిత్‌షా వివరించారు. జోనల్ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి 51 పెండింగ్ అంశాలకు గాను ఈ భేటీ సందర్భంగా 40 పరిష్కరించాం' అని అమిత్‌షా ట్వీట్ చేశారు.

ఏపీ సమస్యలు పరిష్కరిస్తాం
ఇక, ఏపీ -తెలంగాణ మధ్య నీటి వివాదాలు.. ప్రాజెక్టుల అంశాల పైన త్వరలోనే పరిష్కరించేందుకు వీలుగా కార్యాచరణ సిద్దం చేస్తామని హామీ ఇచ్చారు. దీని కోసం సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏపీలో సమస్యలను సుదీర్ఘంగా ప్రస్తావించారు. ఆ సమస్యల పైన అమిత్ షా సానుకూలంగా స్పందించారు. వాటిని పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏపీ సీఎం ప్రస్తావించిన అంశాలు రాష్ట్రాల సమస్యలే కాదని..జాతీయ స్థాయి అంశాలుగా పేర్కొన్నారు.

క్రమం తప్పకుండా సమావేశాలు
దక్షిణ భారత రాష్ట్రాల ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు దేశాన్ని సుసంపన్నం చేశాయని అమిత్ షా కొనియాడారు. 'గత ఏడేళ్లలో 18 జోనల్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించి అనేక సమస్యలను పరిష్కరించాం. ఈ సమావేశాల వల్ల సభ్యుల మధ్య అత్యున్నత స్థాయిలో చర్చలకు అవకాశం ఏర్పడుతుంది. ఇకపై వివిధ జోనల్ కౌన్సిల్ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని భావిస్తున్నాం. దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలను కేంద్రం గౌరవిస్తుంది.
Recommended Video

తిరుపతిలోనే హోం మంత్రి అమిత్ షా
అందుకే ఈ సమావేశం వివరాలను ఆయా రాష్ట్రాల భాషల్లోకి అనువదించేలా కౌన్సిల్ ఏర్పాట్లు చేసింది. భవిష్యత్తులో జరిగే సమావేశాల్లో ప్రతినిధులు సొంత భాషలో మాట్లాడే అవకాశం ఉండాలన్నది కేంద్రం ఆకాంక్షగా అమిత్ షా చెప్పుకొచ్చారు. సమావేశం ముగిసిన తరువాత ఏపీ ముఖ్యమంత్రి జగన్ విందు ఏర్పాటు చేసారు. రాత్రి పది గంటల వరకు సమావేశం జరిగిన హోటల్ లోనే సీఎం ఉన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ మధ్నాహ్నం వరకు తిరుపతిలోనే ఉండనున్నారు. పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications