ఏపీలో కేంబ్రిడ్జి వర్సిటీ, పోలవరానికి మరో 900 కోట్లు
అమరావతి: ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కేంబ్రిడ్జి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, యూనివర్సిటీ ప్రతినిధులను కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి కోరారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటలో ఉన్న ఆయన కేంబ్రిడ్జ్ వర్సిటీని సందర్శించారు.
విద్యార్థుల్లో నైపుణ్యం, పరిశోధన మెరుగు పరిచేవిధంగా విద్యను అందించే యూనివర్సిటీలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాధ్స్ తదితర సబ్జెక్టుల్లో విద్యార్థులు నైపుణ్యం సాధించాలన్నారు.
పోలవరానికి మరో రూ. 900 కోట్లు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం మరో రూ.900 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రాజెక్టు అథారిటీకి కేంద్ర ఆర్ధిక శాఖ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.... 2015-16 బడ్జెట్‌లో కేవలం రూ.100 కోట్లే కేటాయించింది.
దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాదు నాలుగేళ్లో ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఏడాదికి కనీసం రూ. 3 వేల కోట్ల నుంచి రూ. 4 వేల కోట్ల ఖర్చు పెట్టాల్సి ఉండడంతో, ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జలవనరులు, ఆర్థిక శాఖల మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రమంత్రి వెంకయ్య కూడా తన వంతు బాధ్యతగా పోలవరం ప్రాజెక్టు కోసం సంబంధిత మంత్రులతో చర్చించారు.
దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మరో రూ.900 కోట్లు విడుదల చేయడానికి ఆర్థికశాఖ అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో 2015-16లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 1000 కోట్లను కేంద్రం విడుదల చేసినట్లవుతుంది. మొత్తం పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి రూ. 20 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా.












Click it and Unblock the Notifications