పవన్ కల్యాణ్ అభిమానులకు అలాంటి బిరుదు అవసరమా..!!
అమరావతి: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 లేటెస్ట్ ఎపిసోడ్‌పై అందరి దృష్టీ నిలిచింది. చీఫ్ గెస్ట్‌గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావడమే దీనికి కారణం. బాలకృష్ణ తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన సభ్యుడు కావడం, పవన్ కల్యాణ్ జనసేన అధినేతగా రాజకీయాల్లో కొనసాగుతోండటం వల్ల ఈ ఎపిసోడ్ చర్చనీయాంశమైంది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్.. ఇద్దరూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమే కావడం వల్ల రాజకీయాలకు సంబంధించిన అనేక విషయాలు ఈ ఎపిసోడ్‌లో ప్రస్తావనకు వచ్చినట్టే కనిపిస్తోంది.

రాజకీయాల చుట్టూ..
ఈ టాక్ షో సెకెండ్ సీజన్ ఆరంభం కావడమే తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడితో. సినిమాలతో పాటు రాజకీయాలకూ సమాన ప్రాధాన్యత ఉంటుందనే విషయాన్ని ఈ అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 నిర్వాహకులు అప్పట్లోనే పరోక్షంగా స్పష్టం చేసినట్టయింది. ఇప్పుడు తాజాగా పవన్ కల్యాణ్ దీనికి హాజరు కావడం దీనికి మరింత బలాన్ని చేకూర్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్నాయి.

విమర్శలు సునామీ..
పవన్ కల్యాణ్ అన్‌స్టాపబుల్ 2 షోలో పాల్గొనడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని.. పవన్ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు సంధించారు. పవన్ కల్యాణ్‌కు రక్తసంబంధం కన్నా ప్యాకేజీ బంధమే గొప్పదా? అంటూ అంబటి రాంబాబు పవన్ కల్యాణ్‌కు చురకలు అంటించారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే చంద్రబాబుతో కలిసే తిరుగుతున్నారని, బావతో కలిసి తిరిగిన వాడికి బావమరిదితో కలిసి తిరగడంలో కొత్తేమీ కాదని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

ఇక రోజా వంతు..
ఇక పర్యాటక శాఖ మంత్రి రోజా వంతొచ్చింది. పవన్ కల్యాణ్-బాలకృష్ణ షో పట్ల రోజా మరింత ఘాటు రియాక్ట్ అయ్యారు. గతంలో చిరంజీవి పాల్గొన్న కార్యక్రమాలకు దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు అన్ స్టాపబుల్ షోకు ఎందుకు వెళ్లాడో సులభంగానే అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్యాకేజీల కోసం పాకులాడే పవన్ కల్యాణ్‌కు కుటుంబ సభ్యుల కంటే కూడా చంద్రబాబు నాయుడే ఎక్కువ అయ్యాడని ధ్వజమెత్తారు.

ఆ యాడ్ తరహాలో..
వేర్ ఎవరో యు గో అవర్ నెట్ వర్క్ ఫాలోస్ అన్నట్లుగా పవన్ కల్యాణ్ పరిస్థితి తయారైందని రోజా ఎద్దేవా చేశారు. అన్ స్టాపబుల్ షోలో చంద్రబాబు పాల్గొన్నాడు కాబట్టే ఆయనను ఫాలో అవుతూ పవన్ కల్యాణ్ కూడా అందులో భాగస్వామి అయ్యాడని చురకలు అంటించారు. పవన్ కల్యాణ్ బహిరంగ సభలకు వచ్చే ప్రజలను అలగా జనంగా అభివర్ణించిన బాలకృష్ణ హోస్ట్‌గా ఉన్న అన్ స్టాపబుల్ షోకు పాల్గొనడంతో ఆయన స్థాయి ఏమిటో అర్థమైందని మండిపడ్డారు.

ఇద్దరికీ డబ్బులే..
అన్ స్టాపబుల్ షో వల్ల అటు బాలకృష్ణకు డబ్బులు వస్తాయని, ఇటు పవన్ కల్యాణ్‌కు ప్యాకేజీ లభిస్తుందని, మధ్యలో నష్టపోయేది అభిమానులేనని రోజా అన్నారు. పవన్ కల్యాణ్ అభిమానులకు అలగాజనం అని ఒకరితో అనిపించుకోవడం, బిరుదు పొందడం అవసరమా? అని ప్రశ్నించారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు రోజా. ప్రభుత్వాన్ని ఎంత తిట్టినా జనసేన అభిమానుల పట్ల సింపతి చూపించేది తామేనని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications