బొబ్బిలి తాండ్రపాపారాయుడు ఎవరు?
విజయనగరం జిల్లాలో బొబ్బిలి నియోజకవర్గం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎవరు పోటీచేస్తారు? అనే విషయమై చర్చ నడుస్తోంది. ఇక్కడి నుంచి బొబ్బిలికోట వారసులు సుజయక్రిష్ణ రంగారావు 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున, 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందారు. 2019లో మొదటిసారిగా ఆయన ఓటమిని రుచి చూశారు.
2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించిన రంగారావు ఆ తర్వాత పరిణామాల్లో టీడీపీలో చేరి మంత్రిగా పనిచేశారు. ఈ పరిణామాన్ని బొబ్బిలి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. గత ఎన్నికల్లో శంబంగి చిన అప్పలనాయుడుకు ఘనవిజయాన్ని కట్టబెట్టారు.

నియోజకవర్గానికి దూరం జరిగిన రంగారావు
2019 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత సుజయకృష్ణ రంగారావు బొబ్బిలివైపు తొంగి చూడలేదు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరం జరిగారు. విశాఖపట్నంలోనే ఎక్కువగా కాలం వెళ్లబుచ్చారు. ఓటమి తర్వాత రాజకీయాలపై విముఖత ప్రదర్శిస్తూ వస్తున్న సుజయకృష్ణ నియోజకవర్గ బాధ్యతలను ఆయన సోదరుడు బేబినాయనకు చంద్రబాబు అప్పగించారు. మూడు సంవత్సరాల నుంచి ఆయనే పార్టీని నడిపిస్తున్నారు. నియోజకవర్గంలో గట్టి పట్టును సాధించగలిగారు.

బొబ్బిలిలో మారిన పరిస్థితులు
ఆ తర్వాత బొబ్బిలిలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారాయి. రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి బేబినాయన పోటీచేస్తారనేది ఖాయమవడంతో వైసీపీ నుంచి శంబంగి పోటీచేస్తారా? కొత్తవారికి అవకాశం ఇస్తారా? అనేది ఇంకా స్పష్టత రాలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయించుకున్న అంతర్గత సర్వేలో పార్టీ బొబ్బిలిలో వెనకబడినట్లు తేలింది. దీంతో పలు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది.

ప్రత్యేక దృష్టి పెట్టిన వైసీపీ
బొబ్బిలిలో బేబినాయన దూకుడుగా రాజకీయం చేస్తుండటంతో ఆయన్ను తట్టుకోవడానికి చురుకైన యువనేతను రంగంలోకి దింపాలని వైసీపీ భావిస్తోంది. అధిష్టానం ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. బేబినాయనవల్ల నియోజకవర్గం టీడీపీకి ప్లస్ అవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దాదాపుగా రానున్న ఎన్నికల్లో ఆయనే అభ్యర్థి అవుతారంటున్నారు. అయితే బేబినాయన సోదరుడు సుజయకృష్ణ రంగారావు విజయనగరం ఎంపీగా పోటీచేస్తారానే వార్తలు వస్తున్నాయి. దీనిపై పార్టీలో చర్చ నడిచింది. అయితే ఆయన పూర్తిగా దూరం జరిగారా? లేదా? అనేది స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications