వైసీపీలో పోటీకి సిద్ధమవుతోన్న వారసులు వీరే!!
ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. మెరుగైన పనితీరు కనపరచకపోయినా ఇదే చివరి అవకాశమని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేలకు ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. తాజాగా జరిగిన వర్క్ షాప్ లో కూడా ఆయన ఇదే విషయాన్ని తెలియజేశారు. ఎమ్మెల్యేలపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత ప్రభుత్వంపై పడకుండా జగన్ ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఏ నియోజకవర్గాల్లో అయితే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయో ఆయా నియోజకవర్గాల్లో కొత్తవారిని బరిలోకి దింపడానికి సిద్ధమవుతున్నారు.

వారసులకు సీట్లివ్వమని కోరుతున్న సీనియర్లు
పార్టీలోని సీనియర్ నేతలు కొందరు ఈసారి ఎన్నికల్లో తమకు బదులుగా తమ వారసులకు సీటివ్వాలని ముఖ్యమంత్రిని కోరుతున్నారు. దీనిపై ఆయన స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ నేతలంతా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాల్లో వారసులు పర్యటనలు చేస్తున్నారు. మరికొందరు నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలందరితో మమేకమవుతూ సంకేతాలు పంపిస్తున్నారు.

మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీల వారసులు కూడా..
మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వారసులు పోటీకి సిద్ధమవుతున్నారు. వీరిద్దరూ రాబోయే ఎన్నికల్లో పోటీనుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి తెలిపారు. అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం వారసుడు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మచిలీపట్నం నుంచి పేర్ని నాని కుమారుడు పోటీచేస్తారంటూ అక్కడి ప్లీనరీకి వెళ్లిన మాజీ మంత్రి కొడాలి నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణారావు తన తనయుణ్ని ఈసారి ఎన్నికల్లో రేపల్లె నుంచి బరిలోకి దింపాలనే యోచనలో ఉన్నారు.

తిరుపతి నుంచి భూమన తనయుడు
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తన కుమారుడు అభినయ్‌ను బరిలోకి దింపబోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గం మొత్తం అభినయ్ కలియదిరిగారు. గంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ముస్తఫా ఈసారి ఎన్నికల్లో తన కుమార్తె ఫాతిమాను పోటీచేయించాలనే యోచనలో ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి లాంటి సీనియర్ నేతలంతా తమ తమ వారసులను పోటీలోకి దింపబోతున్నారు. వీరందరికీ జగన్ నుంచి హామీ లభించిందా? లేదంటే హామీ ఇస్తానన్నారా? అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.












Click it and Unblock the Notifications