"మీడియాను...సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకొని పాజిటివ్ ప్రచారం చేయండి:సిఎం చంద్రబాబు
అమరావతి:కలెక్టర్ల సదస్సు తొలిరోజు సమావేశంలో ప్రజా సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రైతులకు సమస్యాత్మంగా మారిన చుక్కల భూముల విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లతో మాట్లాడుతూ... ''నెలరోజుల లోపు చుక్కల భూముల సమస్యను పరిష్కరించాలి. ఈ క్రమంలో రైతులకు ఎలాంటి ఇబ్బందీ కలగడానికి వీలులేదు. పైసా అవినీతికి తావులేకుండా ఈ ప్రక్రియను పూర్తిచేయండి''...అని ఆదేశించారు.మీడియాను,సోషల్ మీడియాను వినియోగించుకొని ప్రభుత్వంపై పాజిటివ్ ప్రచారం పెరిగేలా చూసుకోవాలని సిఎం ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.

ప్రజాసమస్యలు...పరిష్కారాలు
గురువారం ఉండవల్లి గ్రీవెన్స్‌హాల్‌లో మొదలయిన తొలిరోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సమస్యలు-పరిష్కారాల విషయమై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా పత్రికల్లో తరుచూ వార్తల్లో కెక్కుతున్న చుక్కల భూముల సమస్యను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. లక్షల మంది జీవితాలతో ముడిపడిన ఈ సమస్యను కలెక్టర్లు తీవ్రంగా పరిగణించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ నేడే...మరో ట్విస్ట్

చుక్కల భూములపై...ఇలా చేయండి
చుక్కల భూముల సమస్యను కలెక్టర్లు నెలరోజుల్లో పరిష్కరించాలని సిఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా, గ్రామ సభల ద్వారా ఈ చుక్కల భూముల సమస్యను పరిష్కరించాలన్నారు. పాలసీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే...ఆయా శాఖలకు ప్రతిపాదించండి. కానీ, ఈ కార్యక్రమం సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత మీదే. ఎక్కడైనా పట్టాలు ఇవ్వకపోతే అందుకు కారణాల్ని తెలుసుకొని, అక్కడికక్కడే ఆ సమస్యను నివృత్తి చేయండి అని సిఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఆర్టీజీ విభాగం ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించాలని ఆయన సూచించారు.

సమస్యలపై...మీడియాలో వార్తలు
ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలు, కథనాలను సమాచార పౌర సంబంధాల శాఖ కార్యదర్శి రామాంజనేయులు సమావేశం సదస్సు దృష్టికి తెచ్చారు. గ్రామాల్లో పాస్‌బుక్‌ల్లో వస్తున్న తప్పుల కారణంగా వారికి బ్యాంకుల నుంచి రుణం రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయని ఈ సమావేశంలో రామాంజనేయులు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖపై పలు వ్యతిరేక కథనాలు వస్తున్నాయని, ఆసుపత్రుల్లో డాక్టర్లు సకాలంలో అందుబాటులో ఉండటం లేదని పత్రికలు ప్రముఖంగా రాస్తున్నాయని ఆయన వివరించారు. అలాగే సిఎం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ మీడియాలో పలు కథనాలు వచ్చిన విషయం ఆయన ప్రస్తావించారు.

ఇలా చేయండి...కృష్ణయ్య సూచన
దీనిపై స్పందించిన ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య మాట్లాడుతూ మీడియాలో, పత్రికల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి పాజిటివ్ కథనాలు వచ్చేలా ఆయా శాఖలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరముందని అన్నారు. ప్రతి నెలా కనీసం ఒక పాజిటివ్ స్టోరీ అయినా వచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ కథనాలు వచ్చేలా కృషి చేయాలని అన్నారు.

మీడియాలో...పాజిటివ్ ప్రచారం
ఈ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకొని మాట్లాడుతూ...‘‘శాఖాపరంగా వచ్చిన వ్యతిరేక వార్తలకు ఆయా శాఖల హెచ్‌వోడీలు సమాధానం చెప్పాలి ...అవి రాజకీయపరమైనవైతే మేం చూసుకొంటాం. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుని పాజిటివ్ ప్రచారం పెంచుకోవాల్సిన అవసరముంది''...అని
సూచించారు. పేద ఎస్సీ మహిళలకు రూ.15 లక్షలతో ఎకరాభూమిని కొనుగోలు చేసి ఇచ్చే భూకొనుగోలు పథకాన్ని చాలా జిల్లాల్లో కలెక్టర్లు సరిగ్గా చేపట్టడం లేదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు సదస్సులో సీఎం దృష్టికి తెచ్చారు. అంతకు ముందు ఆర్‌టీజీఎస్ ద్వారా పలు పథకాల ప్రగతిని ఆ విభాగం సీఈవో బాబు అహ్మద్ సమావేశంలో వివరించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!