బాబుకు షాక్: శ్రీరామ నవమిపై 'ఉత్తరాంధ్ర' పోటీ
విజయనగరం/శ్రీకాకుళం: ఏపీలోని విజయనగరం జిల్లా రామతీర్థంలోనే శ్రీరాముడి కళ్యాణం జరపాలని ఉత్తరాంధ్ర సాధు పరిషత్, రామతీర్థం సేవా పరిషత్‌లు ఆదివారం కోట కూడలి వద్ద శ్రీరామయజ్ఞం నిర్వహించాయి. ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు మాట్లాడుతూ.. న్యాయం, ధర్మం, శాస్త్ర సమ్మతమైన నవమి రోజున ప్రభుత్వం అధికార లాంఛనాలతో రామతీర్థంలోనే సీతారామ కళ్యాణ్ జరిగేలా చూడాలన్నారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని రామతీర్థానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఒంటిమిట్టలో అధికారికంగా శ్రీరామ నవమి వేడుకల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్దమైన విషయం తెలిసిందే. ఈ డిమాండ్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కొత్త తలనొప్పి అని అంటున్నారు.

శ్రీరామనవమి రోజు ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు రాకపై ఉత్తరాంధ్రసాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అభ్యంతరం తెలిపారు. మనవడు పుట్టినందున పురిటిమైలతో ఉన్న చంద్రబాబు నవమి వేడుకల్లో పట్టువస్ర్తాలు సమర్పణకు అనర్హుడన్నారు. నవమి వేడుకలకు చంద్రబాబు దూరంగా ఉండాలని సూచించారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో కాకుండా ఒంటిమిట్టలో నవమి అధికారిక వేడుకలు జరపాలని నిర్ణయించినందునే ఇలా జరిగిందని ఆయన అన్నారు.
ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు కడప జిల్లాలో కొలువై ఉన్నాడు. కడప పట్టణానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో, రాజంపేటకు సమీపంలో ఈ ఆలయం ఉంది. ఒంటుడు, మిట్టుడు అనే వారు ఈ ఆలయాన్ని ఒకేరోజులో నిర్మించారంటారు. ఆలయ నిర్మాణం అనంతరం వారు తమ చనువు చాలించి, శిలలా మారిపోయారని చరిత్ర. ఆలయానికి వెళ్లే దారిలో ఈ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి.
ఒంటిమిట్ట రాముల వారికి ఓ అరుదైన చరిత్ర ఉంది. దేశంలోనే ఎక్కడా జరగని విధంగా.. ఒంటిమిట్ట రాములవారి కళ్యాణం రాత్రి పూట జరుగుతుంది. 1652వ సంవత్సరంలో ఫ్రెంచ్ యాత్రికుడు ఈ ఆలయాన్ని చూసి దేశంలోనే అతి సుందర ఆలయమని ప్రశంసించారు.
ఇక్కడి ప్రజల భక్తుల తన్మయత్వం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఈ ఆలయం 32 పిల్లర్లతో ఉంటుంది. చాలా ఎత్తుగా ఉంటుంది. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలోనే నిర్మించినట్లు ఆధారాలున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications