జగన్‌ది ఏ టర్నో, కెసిఆర్ భలే హుషారు: విహెచ్ వ్యాఖ్య
మహబూబ్‌నగర్: తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ది ఏ టర్నో తెలియడం లేదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నాడని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా యూటర్న్ తీసుకున్నాడని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన అనేది ఈనాడు వచ్చింది కాదని, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించాడని ఆయన అన్నాడు. సమైక్యాంధ్ర అనేది ఏనాడూ లేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకున్న తర్వాతనే అది వచ్చిందని ఆయన అన్నారు. వైయస్ జగన్ తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని పదవి కోసం సంతకాల సేకరణకు పూనుకున్నాడని ఆయన అన్నారు. జగన్‌ది దోచుకోవడం దాచుకోవడమేనని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చాలా హుషారు అని, ఎక్కువ మాట్లాడితే పక్కన పెడ్తారని ఆయన కేశవరావును ఉద్దేశించి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో తమ జైత్రయాత్రకు ప్రజలు రాలేదని, తెలంగాణ ప్రజలు కాంగ్రెసును నమ్మడం లేదని కెకె చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన ఆ విధంగా అన్నారు. వచ్చే ఎన్నికల్లో 30 పార్లమెంటు సీట్లు గెలుచుకుంటామని జగన్ అనడాన్ని ప్రస్తావిస్తూ సీమాంధ్రలో అన్ని సీట్లు ఎక్కడున్నాయని అడిగారు. తెలంగాణలో జగన్ పార్టీ చిరునామా కూడా లేదన ిఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదనే వాదనను ప్రస్తావిస్తూ కాంగ్రెసు ప్రాంతీయ పార్టీ మాదిరిగా ఉండదని, కొట్టదు గానీ కొడితే తీవ్రంగా ఉంటుందని, ఎస్ఐ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయికి కొడుతుందని ఆయన అన్నారు. పంజాబ్‌లో ఇందిరా గాంధీకి పట్టిన గతి సోనియాకు పడుతుందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కుమారుడిని ప్రధానిని చేయడానికి సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఇప్పుడే కాగలరని ఆయన అన్నారు.
రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా జరిగిన ఒప్పందాలను, హామీలను అమలు చేయలేదని రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అందరినీ ఒప్పించి కాంగ్రెసు అధిష్టానం రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అభ్యంతరం చెప్పదని వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో చెప్పారని ఆయన గుర్తు చేశారు. జై ఆంధ్ర ఉద్యమం జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చరిత్రహీనులు కావద్దని, రాష్ట్ర విభజనను వ్యతిరేకించవద్దని ఆయన సీమాంధ్రులను కోరారు.
తెలంగాణ కాంగ్రెసు వల్లనే వచ్చిందని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అంతకు ముందు నుంచే తాము తెలంగాణ కోసం పోరాడుతున్నామని, కెసిఆర్ 2001లో వచ్చారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications