జగన్‌తో ఫిక్సింగ్‌పై విహెచ్ ప్రశ్న, మ్యాచ్ ఆడేదేమీ లేదు
మెదక్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విషయంలో సిపిఎం, సిపిఐల మధ్య మాటల యుద్ధంపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు ఆదివారం స్పందించారు. దేశాన్ని లూటీ చేసి, అవినీతి, ఆర్థిక నేరాలకు పాల్పడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడితో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు రహస్య ఒప్పందం చేసుకోవడం అన్యాయమని విహెచ్ విమర్శించారు.
వామపక్షాల వైఖరి, ఆలోచనా ధోరణి ఈ విషయంలో ఏమైందని ప్రశ్నించారు. ఎవరైనా హత్య చేస్తే ఒక కుటుంబమే నష్టపోతుంది కానీ ఆర్థిక నేరాలకు పాల్పడిన వారి వల్ల వేల కుటుంబాలు నష్టపోతాయన్నారు. ఓట్లు, సీట్లు గెలుపు కోసం సిపిఎం వారు అవినీతిపరులతో చేయి కలిపితే దేశం ఏం కావాలని ప్రశ్నించారు. ఈ విషయం తనకెంతో బాధ కలిగించింద న్నారు.

తెలంగాణ మ్యాచ్ అయిపోయిందని, నిర్ణయం జరిగిపోయిందని, ఇక వారు ఆడేదేమిటన్నారు. ఆర్టికల్ 371డి వల్ల ఏం కాదని చెప్పారు. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి చాంపియన్ అవుతుందని తాను అనుకోవడం లేదన్నారు. మరోవైపు నల్గొండ జిల్లాలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సమైక్యవాద ముసుగులో సీట్ల కోసం సిపిఎం వెంపర్లాడుతోందని విమర్శించారు.
వైయస్సార్ కాంగ్రెసు, సిపిఎం కలయికలపై వస్తున్న ఊహగానాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పుకునే సిపిఎం, పీకల్లోతు అవినీతిలో మునిగిపోయిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పొత్తు ఎలా కుదుర్చుకుంటుందని ఎంపీ ప్రశ్నించారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతూ సమైక్య నినాదం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు, సిపిఎంలకు తెలంగాణలో రాజకీయ సమాధి తప్పదన్నారు.












Click it and Unblock the Notifications