జగన్ కేసుల మాఫీకే, చంద్రబాబు అడ్డుకోవాలి: విహెచ్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర ముసుగులో అక్రమాస్తుల కేసును మాఫీ చేయించుకునేందుకే జగన్మోహన్ రెడ్డి దేశమంతా తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు.
కేసుల నుంచి బయటపడేందుకే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోపాటు ఇతర జాతీయ నేతలను కలుస్తున్నాడని ఆరోపించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని హనుమంతరావు మండిపడ్డారు. మొన్నటి వరకు సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పుకొచ్చిన సిబిఐ.. ఇప్పుడు దేశవ్యాప్త పర్యటనకు ఎలా అనుమతిస్తోందని ప్రశ్నించారు.

జగన్ విషయంతో తాము గతంలో చెప్పిందే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నారని విహెచ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు నాయుడుకు ఆయన సూచించారు. తన పలుకుబడిని ఉపయోగించి చంద్రబాబు.. జగన్మోహన్‌కు అడ్డుకట్ట వేయాలని హనుమంతరావు అన్నారు. ఇందుకు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు కొనసాగించాలని ఆయన తెలిపారు. జగన్ బెయిల్‌ను రద్దు చేయించడానికి చంద్రబాబు ప్రయత్నాలు సాగించాలని ఆయన సూచించారు.
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు జగన్మోహన్ రెడ్డిని ముందే అడ్డుకుని ఉండాల్సిందని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలకు వెళ్లినప్పుడు కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావులు అడ్డుకుని ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొని ఉండేది కాదని వి హనుమంతరావు తెలిపారు.












Click it and Unblock the Notifications