తిరుమలలో వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 59,584 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,905 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.18 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు నిండిపోయాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 నుంచి 22 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది. జనవరి 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లపై టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.
వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేయనున్న తొమ్మిది కేంద్రాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారికి మంచినీళ్లు, టీ, పాలు, కాఫీని అందుబాటులో ఉంచాలని అన్నారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని చెప్పారు.
దర్శనం తేదీ రోజున మాత్రమే భక్తులు తిరుమలకు వచ్చేలా అనుమతులను మంజూరు చేయాలని వెంకయ్య చౌదరి అన్నారు. ప్రొటోకాల్ ప్రముఖులు మినహా ఈ 10 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దయ్యాయని ఆయన పునరుద్ఘాటించారు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ, ఎన్ఆర్ఐ, మొదలైన విశేష దర్శనాల కూడా ఉండబోవని అన్నారు.
వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించినట్లు అదనపు ఈవో తెలిపారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ విక్రయ కేంద్రాల్లో అన్ని కౌంటర్లు కూడా నిర్దేశిత సమయంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
ప్రతి రోజూ 3.50 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుకోవాలని, అదనంగా మరో 3.50 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచుకునేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన పోటు విభాగం అధికారులను ఆదేశించారు. పోలీసుల సహకారం, సమన్వయంతో భక్తులకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు.
చలి తీవ్రతకు భక్తులు ఇబ్బంది పడకుండా ఉండటానికి వసతి గదులు, విశ్రాంతి గృహాల్లో వేడి నీళ్లను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఏఈఓ చెప్పారు. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, మంచి నీళ్లు, టీ, కాఫీ, పాలు, స్నాక్స్ పంపిణీ చేయాలని, దీనికి అవసరమైన అదనపు సిబ్బందిని నియమించుకోవాలని అన్నారు.
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్‌లను ఏర్పాటు చేయాలని, పార్కింగ్ వద్ద నుండి క్యూలైన్ వద్దకు వెళ్లేందుకు ఉచిత బస్సులు అందుబాటులోకి తీసుకుని రావాలని సీహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. భక్తులకు సేవలను అందించడానికి 3,000 మంది యువ శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications