తిరుమలలో వైకుంఠ ఏకాదశికి 1.20 లక్షల సర్వదర్శనం టోకెన్లు: జారీ చేసే తేదీ ఇదే, సమయం ఇదే
Tirumala: కలియుగ వైకుంఠం తిరుమల.. వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది. జనవరి 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
వైకుంఠ ఏకాదశిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే టీటీడీ కొన్ని నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులకు తిరుమలకు వెళ్లొచ్చు గానీ శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం వారికి లభించదు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దవుతాయి. వేదాశీర్వచనాలు కూడా రద్దయ్యాయి.

వైకుంఠ ఏకాదశి నాడు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి టీటీడీ అధికారులు ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఇందులో భాగంగా వైకుంఠ ఏకాదశికి ఒక్క రోజు ముందు అంటే జనవరి 9వ తేదీన స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్‌డీ) టోకెన్లను విడుదల చేయనున్నారు. 9వ తేదీన తెల్లవారు జామున 5 గంటలకు ఉచిత సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారు.
జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు చేస్తారు. ఆ తరువాత రోజులకు ఏరోజుకారోజు దర్శనాలకు ఒక్క రోజు టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు తెలిపారు.
తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, మునిసిపల్ గ్రౌండ్, శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, ఎంఆర్ పల్లి స్కూల్‌తో పాటు తిరుమలలో బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో తిరుమల స్థానికుల కోసం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని శ్యామలరావు అన్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈ సారి వారి ఫొటో గుర్తింపుతో కూడిన స్లిప్ లను జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు.












Click it and Unblock the Notifications