తిరుమలకు వచ్చే భక్తులు మాస్క్ వంటి స్వీయ జాగ్రత్తలు పాటించండి: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
Vaikunta Ekadasi 2025: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 62,566 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 16,021 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.20 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
ప్రస్తుతం భక్తులు వైకుంఠం కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లల్లో వేచివుండనక్కర్లేదు. క్యూలైన్ ద్వారా నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లొచ్చు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది.

మరోవంక- వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది తిరుమల. ఈ నెల 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. లక్షలాదిమంది భక్తులు వచ్చే అవకాశం ఉండటం వల్ల దానికి అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టింది.
ఈ పరిస్థితుల మధ్య టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తిరుమలలో అన్నమయ్య భవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి వివరించారు. ఏడు లక్షల మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తోన్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని అన్నారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినమైన ఈ నెల 10వ తేదీన తెల్లవారు జామున 4:30 గంటలకు ప్రొటోకాల్ దర్శనాలు ప్రారంభమౌతాయని బీఆర్ నాయుడు తెలిపారు. ఉదయం 8 గంటలకు సర్వదర్శనం మొదలవుతుందని వివరించారు. టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
10వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథంపై స్వామివారిని ఊరేగించనున్నట్లు బీఆర్ నాయుడు పేర్కొన్నారు. బంగారు రథాన్ని ఊరేగుతున్న శ్రీవారిని అశేష భక్తులు దర్శించుకోవడానికి వీలుగా మాడ వీధుల్లో ఏర్పాట్లు చేస్తోన్నామని ఆయన అన్నారు.
10 నుంచి 19వ తేదీ వరకు అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని బీఆర్ నాయుడు చెప్పారు. టికెట్లు లేని భక్తులు తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకూడదని విజ్ఞప్తి చేశారు. సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో దర్శనాలను కల్పించేందుకు సిఫారసు లేఖల దర్శనాలను రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట వేశామని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అదేశాల మేరకు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. మైసూరు నుంచి వచ్చిన నిపుణులతో చేసిన పుష్పాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు.
భక్తుల భద్రత కోసం 3,000 సీసీ కెమరాలతో నిఘా ఉంచుతామని బీఆర్ నాయుడు తెలిపారు. గోవిందమాల ధరించిన భక్తులకు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు ఉండబోవని, భక్తులు అందరిలాగే కలిసి స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు తీసుకొని వైకుంఠ ద్వార దర్శనాలకు రావాలని విజ్ఞప్తి చేశారు.
టోకన్లు, టికెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించరంటూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తోన్నారని, తిరుమలకు వచ్చే భక్తులను ఎవరు ఆపరని అన్నారు. అసత్య ప్రచారాలు, అపోహలు నమ్మవద్దని భక్తులను కోరుతున్నానని పేర్కొన్నారు. హెచ్ఎంపీవీ వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో భక్తులు మాస్క్ లాంటి స్వీయ జాగ్రత్తలు పాటించాలని బీఆర్ నాయుడు కోరారు.












Click it and Unblock the Notifications