చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ పై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు అంశంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. నియోజకవర్గ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని మచిలీపట్నం కలెక్టర్ పి.రంజిత్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వంశీ మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ పేరు తీసేసినంత మాత్రాన ఆయనకున్న గౌరవం తగ్గదని, వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడంవల్ల ఆయనకున్న ఖ్యాతి పెరగదన్నారు. ఇది కేవలం రెండు రాజకీయ పార్టీల నడుమ నడుస్తున్న వివాదమని కొట్టిపారేశారు.
అమరావతి రైతులు జూనియర్ ఎన్టీఆర్ ను దూషించడం సరికాదని వంశీ అన్నారు. జూనియర్ చెబితేనే భూములిచ్చారా? అని ప్రశ్నించారు. తన స్వయంకృషితో ఎదిగిన వ్యక్తిని చంద్రబాబు తన రాజకీయ అవసరాలకు కరివేపాకులా వాడుకొని వదిలేశారంటూ విమర్శలు గుప్పించారు. గన్నవరంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడంపై వంశీ స్పందించారు. ఎటువంటి అక్రమ మైనింగ్ జరగడంలేదన్నారు.

ఎయిర్ పోర్టు విస్తరణ పనులకు అవసరమైన మట్టి, రాళ్లను గన్నవరం పరిసరాల్లోని కొండ ప్రాంతాల నుంచే రవాణా జరుగుతోందని, ఈ పనుల్లో ఎవరి జోక్యం ఉండదని వంశీ అన్నారు. ఆర్గానిక్ చేపలు పెరుగుతున్న బ్రహ్మలింగయ్య చెరువును తవ్వేస్తున్నాన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తర్వాత వంశీ స్పందించలేదని విమర్శలు వచ్చాయి. మొబైల్ ఫోన్ ను స్విచ్చాఫ్ చేశారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనిపై స్పందించారు. పేరు మార్చిన సమయంలో తన వినతిని పరిశీలించాలంటూ ముఖ్యమంత్రి జగన్ కు ఒక లేఖ రాశారు.












Click it and Unblock the Notifications