గుడ్‌న్యూస్: ఏపీకి మరో వందేభారత్... ఈ రూట్‌లోనే
రెండు తెలుగు రాష్ట్రాలను వందేభారత్ రైళ్లు ముంచెత్తుతున్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి ప్రస్తుతం తొమ్మిది వందేభారత్ రైళ్లు నడుస్తుండగా తాజాగా మరో వందేభారత్ రైలుకు ప్రతిపాదన వెళ్లింది. ఇది త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. నరసరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ ను కలిపి ప్రతిపాదన అందజేశారు. విజయవాడ, గుంటూరు అమరావతికి సమీపంలోనే ఉంటాయని, భవిష్యత్తులో ఈ రెండూ జంటనగరాలుగా మారబోతున్నాయని తెలిపారు. ఇటువంటి నగరాలకు ఐటీ నగరమైన బెంగళూరుకు సత్వరమే చేరుకోవడానికి సరైన వ్యవస్థ లేదని చెప్పారు.
విజయవాడ నుంచి 16 గంటలు పడుతోంది
రోడ్డు మార్గంలో బెంగళూరు చేరుకోవాలంటే విజయవాడ నుంచి 15 గంటల నుంచి 16 గంటల సమయం పడుతోందన్నారు. వందేభారత్ ప్రవేశపెడితే ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, పర్యాటకులకు మేలు కలుగుతుందన్నారు. ఏ మార్గంలో నడపాలి? ఏయే స్టేషన్లలో నిలపాలి? అన్న అంశాలను కూడా ఎంపీ మంత్రికి తెలియజేశారు. విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురంరోడ్, గిద్దలూరు, నంద్యాల, డోన్, గుంతకల్లు, అనంతపురం, హిందూపురం, యలహంక స్టేషన్లలో వందేభారత్ కు హాల్టింగ్ కల్పించాలని కోరారు. ఈ నగరాల నుంచి వ్యాపారులు ఎక్కువగా బెంగళూరుకు పయనిస్తుంటారని ఎంపీ మంత్రికి తెలియజేశారు.

ఏ మార్గంలో నడుపుతారో?
దీనిపై రైల్వే మంత్రి హామీ ఇచ్చారు. అయితే విశాఖపట్నం ఎంపీలు విశాఖ నుంచి చెన్నైకి, విశాఖ నుంచి బెంగళూరుకు వందేభారత్ రైళ్లు నడపాలని రైల్వేమంత్రిని కోరారు. విశాఖ నుంచి బెంగళూరుకు అంటే విజయవాడను అనుసంధానం చేస్తారు. మరి గుంటూరుమీదుగా వెళుతుందా లేదంటే తెనాలి, ఒంగోలు మార్గంలో వెళుతుందా? అనేది తెలియాల్సి ఉంది. వందేభారత్ రైలుతోపాటు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మరికొన్ని వినతులను కూడా రైల్వేమంత్రికి అందజేశారు. రాష్ట్రంలో ఎక్స్ టెండెడ్ రియాలిటీ, కామిక్స్, విజువల్ ఎఫెక్స్ట్, గేమింగ్, యానిమేషన్ కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications