వందే భారత్ లా వందే మెట్రో..
ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో వేగవంతమైన ప్రయాణ సాధనాన్ని అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లను వివిధ మార్గాల్లో ప్రవేశపెట్టింది. ఈ స్ఫూర్తితో పెద్ద పెద్ద నగరాల నుంచి సమీప రూరల్ ప్రాంతాలకు వేగంగా రాకపోకలు జరపాలనే ఉద్దేశంతో డిసెంబరు నుంచి కేంద్ర ప్రభుత్వం వందే మెట్రో తీసుకురాబోతోంది. ఈ ఏడాది డిసెంబరుకల్లా వందే మెట్రో నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకొస్తాని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
వందే భారత్ రైళ్ల జర్నీతో పోలిస్తే వందే మెట్రో జర్నీ విభిన్నంగా ఉంటుందని, ఎక్కువ ఫ్రీక్వెన్సీతో రోజుకు నాలుగు నుంచి ఐదు సర్వీసులు నడిపేలా రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పెద్ద పెద్ద నగరాల నుంచి 100 కిలోమీటర్లలోపు ఉన్న ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయని, సౌకర్యవంతంగా ఉండటంతోపాటు అందరికీ అందుబాటు ధరల్లోనే ఉంటాయని, ఈ ఏడాది డిసెంబరుకల్లా పట్టాలెక్కనున్నాయని చెప్పారు.

పెద్ద పెద్ద నగరాలకు చుట్టుపక్కల ఉన్నవారంతా ఈ నగరాలకు వచ్చి అత్యంత వేగంగా తమ సొంత స్థలాలకు చేరుకునేలా వందే మెట్రో ఉండబోతోందన్నారు. వందే మెట్రోని తీసుకురావాలని ప్రధానమంత్రి మోడీ సంకల్పించారని, త్వరలోనే కార్యరూపం దాల్చబోతున్న ఈ ప్రాజెక్టువల్ల విద్యార్థులు, ఉద్యోగులు ఎంతో ప్రయోజనాన్ని పొందుతారని అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు.
వందే భారత్ రైళ్ల తరహాలోనే 'వందే మెట్రో 'రైళ్లను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ఫిబ్రవరిలో రైల్వే శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, లక్నోలోని రీసర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్‌కు ఆర్డర్లు ఇచ్చినట్లు చెప్పారు. ఎనిమిది బోగీలతో ఈ వందే మెట్రోలను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు.












Click it and Unblock the Notifications