
పేపర్ పెడతా.. ఛానల్ పెడతా అంటాడు.. ఎవరికైనా చూపించండ్రా పాపం: విజయసాయిరెడ్డిపై అనిత సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసపల్లా భూముల విషయంలో రసవత్తర రాజకీయం కొనసాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దసపల్లా భూములలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, విశాఖ నగరంలో కోట్ల రూపాయల విలువైన భూములను ప్రైవేటు పరం చేయడం వెనక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో దసపల్లా భూముల వ్యవహారంపై వివిధ వార్తా పత్రికలలో విభిన్న కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన విజయసాయిరెడ్డి త్వరలో తాను మీడియా రంగాల్లో ఎంట్రీ ఇస్తానని ప్రకటించారు.
సాయిరెడ్డిని టార్గెట్ చేసిన వంగలపూడి అనిత
ఇక విజయసాయి రెడ్డి చేసిన మీడియా ఎంట్రీ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సెటైర్లు వేశారు. బుద్ధీ, జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా తనపై ఆరోపణలు కానీ అవాస్తవాలు గానీ ప్రచురిస్తే కోర్టు కి వెళ్తారు అంటూ వంగలపూడి అనిత పేర్కొన్నారు. నిజంగా తనపై దుష్ప్రచారం చేస్తే, తన పరువుకు భంగం కలిగితే పరువు నష్టం దావా వేస్తారు అని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా విజయ్ సాయి రెడ్డి మీడియా లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పడం పై తనదైన సెటైర్లు వేసిన ఆమె ఈడెవడండీ.. "పేపర్ పెడతా.. టీవీ ఛానల్ పెడతా" అంటాడు.. అలా వదిలేయకండి రా బాబూ.. ఎవరికైనా చూపించండి పాపం అంటూ విజయసాయి రెడ్డి ని టార్గెట్ చేశారు.

సాయిరెడ్డి పై మండిపడిన అయ్యన్న పాత్రుడు
అంతేకాదు దసపల్లా భూముల విషయంలో విజయసాయిరెడ్డి అవినీతిని ప్రశ్నిస్తే టీవీ ఛానల్ పెడతా, మీడియా లోకి వస్తా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. 45 వేల కోట్ల విలువైన ఆస్తులను విజయసాయిరెడ్డి ఆయన బినామీలు దోచుకున్నారని, దసపల్లా భూములను బినామీలకు కట్టబెట్టి లబ్ధి పొందుతున్నారని అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అక్రమాలపై సిబిఐ, ఈ డి లతో కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.

ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయిన సాయిరెడ్డి లేటెస్ట్ కామెంట్స్
అవినీతి గురించి ప్రశ్నిస్తే విజయసాయి రెడ్డి తనపై ఉద్దేశ్యపూర్వకంగా ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించటాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపించుకోవలసిన ఎంపీ ఏ మీడియా రంగం నుండి తనపై దుష్ప్రచారం జరుగుతుందో అదే మీడియా రంగంలోకి అడుగు పెట్టబోతున్నా అని ప్రకటించడం, మీడియాలో రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేస్తున్న కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణం గా మారింది.