అమరావతి రైతులకు ప్లాట్లు ఇవ్వటానికి ఐదేళ్ళా? జగన్ ప్రభుత్వ తీరుపై వంగలపూడి అనిత సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ తీరుపై వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏపీ ప్రభుత్వ విధానాలపై, ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు పూర్తిగా అభివృద్ధి చేస్తున్న ప్లాట్లను ఇవ్వాలని హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ను వంగలపూడి అనిత టార్గెట్ చేశారు .
రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు మూడు నెలల్లోగా ప్లాట్లు అభివృద్ధిపరచి ఇవ్వాలని రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక వసతులు నెలరోజుల్లో ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించగా ఆ ఆదేశాల అమలుకు ఐదేళ్లు పడుతుందని ఆ మేరకు సమయం పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఈ అఫిడవిట్ దాఖలు చేశారు.

ఈ అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు చూస్తే పంది భూములిచ్చిన రైతులకు ప్రాథమిక మౌలిక వసతుల అభివృద్ధి చేసిన 63,452 ప్లాట్లు అప్పగించాల్సి ఉంది. ఇక భూ సమీకరణ వివాదం కారణంగా కొన్ని ప్లాట్లు కేటాయించలేదని, ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం రైతులకు నోటీసులు ఇచ్చామని ఆ ప్రక్రియ పెండింగ్లో ఉందని పేర్కొన్నారు. అమరావతిలో ప్రధాన మౌలిక వసతులను అభివృద్ధి చేసిన ప్లాట్లు తిరిగి రైతులకు ఇవ్వాలంటే ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 5 ఏళ్ల సమయం పడుతుందని పేర్కొన్నారు.
ఇక ఈ అఫిడవిట్ పై, ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలపై మండిపడిన వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీ హయాంలో మనం 42,000 ప్లాట్లు కేవలం ఏడాదిలోగా ఇస్తే ఒక్క ప్లాట్ కూడా ఇవ్వలేదు అని కూసారు అడ్డగాడిదలు అంటూ మండిపడ్డారు. ఏపీలో టిడిపి మీద విమర్శలు చేసే వారి తీరు ఎలా ఉంటుందీ అంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో అయితే మూడు నెలలకే బిడ్డ పుట్టెయ్యాలి. వాళ్ళ ప్రభుత్వం అయితే మూడేళ్ళు పోయాక, ప్రసవానికి మరో ఐదేళ్ళు కావాలి అంటారు అంటూ వంగలపూడి అనిత ఎద్దేవాచేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్లాట్లు ఇవ్వడానికి ఐదేళ్ల సమయం పడుతుందా అంటూ సెటైర్లు వేశారు.












Click it and Unblock the Notifications