కిరణ్ రెడ్డి హీరో, మన్మోహన్ జీరోనా: టీపై వెంకయ్య
విశాఖపట్నం: తెలంగాణ బిల్లును తిరస్కరించి పంపించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హీరో, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన ప్రధాని మన్మోహన్ సింగ్ జీరోనా అని బిజెపి జాతీయ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. తెలంగాణపై కాంగ్రెసు వైఖరిని తప్పుపడుతూ ఆయన ఆ వ్యాఖ్య చేశారు. పార్లమెంటులో చోటుచేసుకున్న ఘటనలు జాతికి జరిగిన అవమానమని, దీనికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాద్యత వహించాలని ఆయన అన్నారు.
శనివారం ఉదయం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఇరు ప్రాంతాల సభ్యులను కాంగ్రెసు పార్టీయే ఉసిగొల్పిందని, తమ ఎంపీలనే కొట్టించాలని చూశారని విమర్శించారు. పార్లమెంటులో అవాంఛనీయ ఘటనలు జరుగతాయని ముందే సమాచారం ఉన్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. సభలో ప్లకార్డుల సంస్కృతిపోయి ప్లెక్సీల సంస్కృతి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులే సభలో ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్నారని, సభలో సమస్యలు ప్రస్తావన రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సభలో ఎంపీల తీరును చూసి హృదయం ధ్రవిస్తోందని అన్న ప్రధానికి అసలు హృదయం ఉందా అని ఆయన అడిగారు. గత తొమ్మిదిన్నరేళ్లుగా నిద్రపోయి ఇప్పుడు హఠాత్తుగా మేలుకొని గందరగోళం సృష్టించి తమ పార్టీని నిందిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు బిల్లు పెట్టలేదంటుంటే కాంగ్రెస్ పెట్టామంటోందని ఆయన అన్నారు.
ఇంతటి ముఖ్యమైన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సభలో ప్రధాని, సోనియా ఎందుకు లేరని వెంకయ్య ప్రశ్నించారు. తమ పార్టీ ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీ కాదని, భారతీయులకు ప్రాతనిధ్యం వహించే పార్టీ అని ఆయన అన్నారు. ఇచ్చిన మాటపై నిలబడటం తమ పార్టీ బలమని స్పష్టం చేశారు. విభజనతో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రకు న్యాయం చేయడం మీ బాధ్యత అని, తాము షరతులు పెట్టామనడం సరికాద న్నారు.
కాంగ్రెస్ పార్టీకి బిల్లు తేవాలని లేదని, బిల్లు తెచ్చినట్లు ప్రయత్నించి ఆ నెపాన్ని ప్రతిపక్షంపై నెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. సొంతపార్టీ ఎంపీలకే నచ్చజెప్పలేని కాంగ్రెస్ తమపై విమర్శలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications