ఇప్పుడా నోటికొచ్చినట్లు మాట్లాడేది: రాహుల్‌కు వెంకయ్య, భూసేకరణ పైనా
ఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ లేఖ రాయడంపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం స్పందించారు. అదే సమయంలో ఓటు బ్యాంక్ రాజకీయాల పైనా మాట్లాడారు.
నాడు అధికారంలో ఉండగా ఏపీ యోగక్షేమాలు విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ప్రత్యేక హోదా విషయం గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా పోయాక హోదా గుర్తుకు వచ్చిందన్నారు. అప్పుడే హోదాకు చట్టబద్ధత కల్పించి, ప్రణాళిక సంఘం ఆమోదం పొందేలా చూడాల్సిందన్నారు.
ఈ విషయాన్ని విస్మరించి మీ పార్టీ నేతలు ఇప్పుడు ప్రధానికి లేఖ రాస్తారా, గతంలో నోరు మెదపని మీకు ప్రస్తుతం నోటికి వచ్చినట్లు మాట్లాడే హక్కు ఎవరిచ్చారని ధ్వజమెత్తారు. కేంద్రంలో యూపీఏ ఉన్నప్పుడు చేసిన నిర్వాకాలు మరిచి ఇప్పుడు హోదాపై మోడీకి లేఖ రాయడం విడ్డూరమన్నారు.
అధికారంలోకి వస్తే ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేసి తీరుతామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలు చేయటానికి పదేళ్లు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక కేటగిరి హోదాను ఇచ్చి ఇతోధిక ఆర్థిక సహాయం ప్రకటించాలని చేస్తున్న డిమాండ్ ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శమన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లేఖరాయటం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిందని ఆరోపించారు.
ప్రత్యేక కేటగిరి హోదాను ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈఅంశాన్ని పునర్విభజన చట్టంలో ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించారు. మంత్రివర్గం ఈ ప్రత్యేక హోదాకి ఆమోద ముద్ర ఎందుకు వేయలేదన్నారు. విభజన సమయంలోప్రజలను మభ్యపెట్టి విద్వేషాలు ఎవరు రెచ్చగొట్టారో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు.
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అరవై ఏళ్ల పాలనలో దేశంలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీకి బిజెపిని విమర్శించే హక్కు లేదన్నారు.
గతంలో ఓ రాష్ట్రంలో 5 లక్షల ఎకరాలను బలవంతంగా సేకరించి పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంగుళం కూడా సేకరించనీయమని.. అభివృద్ధికి అడ్డుపడటం విడ్డూరమన్నారు. విభజన సమయంలో రెండు నాల్కల ధోరణి అవలంభించిందన్నారు. ప్రధాని మోడీ బొమ్మలు తగలబెట్టడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications