పురంధేశ్వరి విశాఖ అడగలేదు, నేను దూరం: వెంకయ్య
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ మెజార్టీ సీట్లు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆ పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం అన్నారు. ఆయన హైదరాబాదులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుపరిపాలన అందించగల నేత బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీయేనని చెప్పారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ అధ్యక్షులు మోడీతో కలిసి పని చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారన్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి విశాఖపట్నం టికెట్ అడగలేదని ఆయన చెప్పారు. తాను దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికకు, పొత్తుల నిర్ణయానికి దూరంగా ఉంటున్నట్లు ఆయన తెలిపారు. పొత్తుల అంశాన్ని రాష్ట్ర శాఖలు చూసుకుంటాయని వెంకయ్య నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులు, అభ్యర్థుల ఎంపిక విషయాల్లో తాను కలుగజేసుకోనని ఆయన చెప్పారు.
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు మోడీతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. రికార్డు స్థాయిలో బిజెపి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారత దేశానికి మోడీయే శ్రీరామ రక్ష అన్నారు. కొత్తగా ఏర్పడిన రెండు ప్రాంతాలు అభివృద్ధి సాధించాలంటే బిజెపి విజయం సాధించాలన్నారు. మోడీ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందని, ఎవరు విశ్వసనీయులుగా ఉంటారు? సమర్థులెవరు? గెలిచే అవకాశం ఎవరికి ఉంది? అనే అంశాలు ప్రజలు చూడాలన్నారు.

ప్రాంతీయ పార్టీలకు జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని చెప్పారు. అందుకే బిజెపిని ప్రజలు ఎన్నుకోవాలని కోరారు. మోడీ ఇప్పటికే సమర్థుడైన నాయకుడిగా నిరూపించుకున్నారన్నారు. మోడీ సమర్థత పైన జాతీయ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రపంచ దేశాల్లో మోడీ పైన చర్చ జరుగుతోందని, సత్సంబంధాల కోసం చూస్తున్నారన్నారు.
దేశాన్ని గట్టెక్కించే నాయకుడు మోడీయే అన్నారు. సుపరిపాలన, సమర్థత, సుస్థిర ప్రభుత్వం మోడీతో సాధ్యమన్నారు. బిజెపి 200-220 సీట్లు సాధిస్తుందని, ఎన్డీయే 240కి పైగా సీట్లు సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయని కానీ, బిజెపియే మెజార్టీ సీట్లు సాధించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల నాటికి 300 మార్క్ దాటే అవకాశముందన్నారు. కర్నాటకలో బిజెపి బలం పుంజుకుందని, తెలంగాణ, సీమాంధ్రల్లోను బలం పెరిగిందన్నారు.
విశ్వసనీయ, సమర్థత, పాజిబులిటీ... ఈ మూడింటిని ప్రజలు బిజెపి, మోడీలోనే చూస్తున్నారన్నారు. కొందరు రాష్ట్ర నేతలు ఇరవై సీట్లు ఇవ్వండి చక్రం తిప్పుతామంటున్నారని.. ఉన్నప్పుడు వారేం చేశారని ప్రశ్నించారు. సీమాంధ్ర హామీలు బిజెపి వల్లనే సాధ్యమన్నారు.












Click it and Unblock the Notifications