తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు.. వీవీఐపీ దర్శనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం నాడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఇక ఈ నేపధ్యంలో ఆయన వీఐపీ దర్శనాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామిని దర్శించుకున్న వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు.

కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి
వైకుంఠం1 క్యూ కాంప్లెక్స్ ద్వారా వెంకయ్య నాయుడు కుటుంబ సమేతంగా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ మహా ద్వారం వద్ద ఆలయ అర్చకులు భారత ఉపరాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. గురువారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు.స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదం చేశారు. ఆలయ అధికారులు స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి తీర్ధ ప్రసాదాలు అందజేసారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. యాధ్బావం తద్భవతి అన్న ఆయన దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు.

వీవీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే స్వామిని దర్శించుకోవాలన్న వెంకయ్య నాయుడు
ప్రముఖులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలని వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు. అలా సంవత్సరానికి ఒక్కమారు దర్శించుకుంటే ఎక్కువ మంది సామాన్య భక్తులకి స్వామి వారి దర్శన భాగ్యం కల్పించిన వారు అవుతారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిని ప్రముఖులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆచరిస్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు.

తాను ఏడాదికి ఒకసారే శ్రీవారిని దర్శించుకుంటానని చెప్పిన వెంకయ్య నాయుడు
ఎప్పుడూ తను కూడా అదే విధంగా ఆచరించేందుకు ప్రయత్నిస్తుంటానని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రస్తుతం మనవరాలి వివాహంలో పాల్గొనేందుకు తిరుమల వచ్చి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు. అదే పనిగా వీవీఐపీలు వస్తుంటే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా మరోసారి దర్శించుకోవాలన్న భావన ఉంటుందని అన్నారు. హిందూ ధర్మపరిరక్షణ, భారతీయ సంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రపంచానికి అందించాలని వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు.
Recommended Video

అందరూ సన్మార్గంలో నడవాలని కోరుకున్న భారత ఉపరాష్ట్రపతి
ఒకవేళ రెండో సారి స్వామి వారిని దర్శనం చేసుకోవాలనుకుంటే సాధారణ భక్తుల్లా వెళ్లాలని ఆయన సూచించారు. భారతదేశం మంచి అభివృద్ధి పథంలో నడుస్తోందన్న వెంకయ్య నాయుడు అభివృద్ధి ఫలాలు అందరికి అందేవిధంగా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సన్మార్గంలో అందరిని నడిపించమని కోరుకున్నానని ఆయన తెలిపారు. ప్రకృతి కరుణించి, సకాలంలో వర్షం కురిసి, ప్రకృతి విపత్తులు లేకుండా ఉండాలని ఆయన కోరుకున్నారు. గతంలోనూ ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications