ఎక్కడ ఏముందో చూస్తారు, చంద్రబాబుతో నాకు ఎలాంటి అవసరం లేదు: వెంకయ్య
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడ ఏ అవకాశముందా అని ఆలోచిస్తారని, మంచి చేసే వారిని పొగడటం తనకు అలవాటు అని, కానీ కొందరు విమర్శలు చేస్తున్నారని, చంద్రబాబుతో తనకు ఎలాంటి అవసరం లేదని వెంకయ్య అన్నారు.
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏ అవకాశముందా అని ఆలోచిస్తారని, మంచి చేసే వారిని పొగడటం తనకు అలవాటు అని, కానీ కొందరు విమర్శలు చేస్తున్నారని, చంద్రబాబుతో తనకు ఎలాంటి అవసరం లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.
గురువారం గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభించారు. రన్ వే విస్తరణకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, కొల్లు రవీంద్ర, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
రూ.137 కోట్లతో నిర్మించిన విదేశీ టెర్మినల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. విజయవాడ విమానాశ్రయాన్ని చూస్తే బాధగా ఉండేదన్నారు. ఏపీలో విజయవాడ కళలకు కేంద్రమన్నారు.

గన్నవరం విమానాశ్రయంలో పనులు ఇంత వేగంగా జరిగాయంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని వెంకయ్య చెప్పారు. వెంకయ్య తన పైన ప్రశంసలు కురిపిస్తుంటే చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వారు.
ఎక్కడ ఏ అవకాశముందా అని చంద్రబాబు ఆలోచిస్తారని, అలా కనిపెట్టే సామర్థ్యం ఉందన్నారు. ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీ ఏం చేస్తారా.. అని ఆలోచించి, చేసి చూపించే వ్యక్తి చంద్రబాబు అన్నారు.
చంద్రబాబును పొగుడుతుంటే కొందరు తనను విమర్శిస్తుంటారని, కానీ ముఖ్యమంత్రితో తనకు వ్యక్తిగత అవసరాలు ఏమీ లేవన్నారు. ఆయన మంచి చేస్తున్నారు కాబట్టి తాను పొగుడుతున్నానని చెప్పారు. మంచి చేసిన వారిని ప్రశంసించడం భారతీయులు సాధారణంగా చేస్తారన్నారు. ఏపీ పైన మోడీ మమకారం, సీఎం సహకారం ఉందన్నారు.
ఏపీ ఆర్థిక అభివృద్ధికి మొదటి అడుగు పోలవరం ప్రాజెక్టు అయితే, విమానయాన విస్తరణ రెండోది అన్నారు. విశాఖ కారిడార్ మరొకటి అన్నారు. రవాణా మరింత పెరగనుందని, ఏపీ ఓ హబ్‌గా మారనుందన్నారు.
రవాణా అభివృద్ధి వల్ల చాలా ప్రయోజనాలుంటాయన్నారు. ఇక్కడ రవాణా లేక టమోటాలు రోడ్ల పైన పారేసుకున్నారన్నారు. వ్యవసాయ ఆధారిత పంటలకు రవాణా వ్యవస్థ అవసరమన్నారు. వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలపై ఆధారపడిన రాష్ట్రం ఏపీ అన్నారు.












Click it and Unblock the Notifications