ప్రత్యేక హోదా.. కోటి మృతి: వెంకయ్య స్పందన, చిరంజీవిని టార్గెట్ చేసిన కెఈ
న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం దురదృష్టకరమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం అన్నారు. ఏపీకి న్యాయం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ అసమగ్రంగా రాష్ట్రాన్ని విభజించడం వల్లే సమస్య తలెత్తిందన్నారు.
ప్రత్యేక హోదా కోసం ఆత్మాహుతియత్నం చేసిన కోటి మృతి
తిరుపతిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముని కామ కోటి(41) ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు.
కాంగ్రెస్ పార్టీ పోరుసభ జరుగుతున్న ప్రాంగణంలో ఆ పార్టీ కార్యకర్త ముని కామకోటి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అరుస్తూ ఒక్కసారిగా కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని పరుగులు తీశాడు.

వెంటనే కామకోటిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వేలూరులోని సీఎంసీకి తరలించారు. చికిత్స పొందుతూ కామకోటి మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ప్రత్యేక హోదా సాధించి తీరుతాం: కేఈ కృష్ణమూర్తి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించి తీరుతారని ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వేరుగా అన్నారు. విభజన సమయంలో చట్టంలో ప్రత్యేక హోదాను ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు.
నాడు ప్రత్యేక హోదాపై కుట్రతో వ్యవహరించి నేడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. నాడు కేంద్రమంత్రిగా ఉన్న చిరంజీవి ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నార్నారు.
కాంగ్రెస్ ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా ప్రజలు నమ్మరన్నారు. ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో యువకుడి ఆత్మహత్యాయత్నం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకూడదని కోరుకుంటున్నట్లు కెఈ చెప్పారు.
భావోద్వేగానికి లోనుకావొద్దు: చంద్రబాబు, జగన్
కోటి అనే యువకుడి ఆత్మాహుతియత్నం తనను ఎంతో కలచివేసిందని ఏపీ సిఎం చంద్రబాబు శనివారం అన్నారు. ప్రత్యేక హోదా విషయమై ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దన్నారు. కుటుంబానికి, సమాజానికి మీరు చాలా ముఖ్యమన్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదేనని చెప్పారు.
ఆత్మహత్యలకు పాల్పడవద్దని వైసీపీ అధ్యక్షులు జగన్ అన్నారు. ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో ఒక యువకుడు ఆత్మహత్యాయత్నం చేయడం ఎంతో బాధాకరమన్నారు. ఆ యువకుడి ప్రాణాలు రక్షించేందుకు తగిన వైద్యసహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నాగార్జున వర్సిటీ ఇంఛార్జి ఉపకులపతిగా ఉదయ లక్ష్మి
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంచార్జి ఉపకులపతిగా ఉదయలక్ష్మి నియమితులయ్యారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా ఉన్న ఉదయలక్ష్మిని ఇంఛార్జి ఉపకులపతిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిషికేశ్వరి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications