టీపై అనుమానాలు, బాబుతో పొత్తు ఉట్టిదే: వెంకయ్య
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో ఎవరికీ అనుమానాలు ఉండకూడదని, అన్ని సందేహాలనూ నివృత్తి చేయాల్సిందేనని బిజెపి జాతీయ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. పార్టీ నేతలు కిషన్‌రెడ్డి, సి.హెచ్.విద్యాసాగర్‌రావు, యడ్లపాటి రఘునాథ్‌బాబు, ఎన్.ఇంద్రసేనారెడ్డి, ఎన్.రామచంద్రారావు, కె.లక్ష్మణ్, గోలి మధుసూదన్‌రెడ్డిలతో కలిసి గురువాంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ బిల్లును ఆపొద్దనిగానీ, మద్దతు ఇవ్వొద్దనిగానీ తమ జాతీయ నేతలను ఇప్పటివరకు తాము కోరలేదని చెప్పారు. తమకు అనుమానాలు ఉన్నాయంటూ మా పార్టీ సీమాంధ్ర నేతలు అంటున్నారని, అనుమానాలను నివృత్తి చేయడం సంతోషమేనని వెంకయ్య నాయుడు అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ అనుమానాలు, సందేహాలు, అపోహలు ఉన్నాయని చెప్పారు.

రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ప్రజల్లో నెలకొన్న సందేహాలపై చర్చిండంలో తప్పేమిటని అడిగారు. అనుమానాలు ఉండకూడదని, వాటిని నివృత్తి చేసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. కానీ రాష్ట్రాన్ని రెండుగా విభజించాలన్న దానికి తమ పార్టీ కట్టుబడి ఉందని, ఇప్పటికీ అదే డిమాండ్‌తో ముందుకు వెళుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు గురించి ప్రస్తావించగా తాము ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం లేదని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. తెలుగుదేశం నుంచి గానీ, బిజెపి నుంచి గానీ ఎలాంటి సంప్రదింపులు, చర్చలు జరగలేదన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పత్రికల ఊహాగానాలేనన్నారు. తమ పార్టీ రాష్ట్రంలోని 42 ఎంపీ సీట్లు, 294 ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేస్తుందని ప్రకటించారు.
జగన్ కేసులో సిబిఐ పాత్ర గురించి ప్రశ్నించగా - ఇప్పటివరకు చాలా కేసుల్లో సిబిఐ నిర్వహించిన పాత్ర ఏమిటో చెప్పామని, కాంగ్రెస్‌కు సిబిఐ ఎలా వంత పాడుతుందో దేశ ప్రజలందరికీ తెలుసునని ఆయన అన్నారు. జగన్ కేసులోనూ అలాంటి పాత్రే పోషించిందని విమర్శించారు. ఇది కూడా సీబీఐ కాంగ్రెస్ చేతిలో పావు అన్న దానికి ఉదాహరణ' అనిఅన్నారు.












Click it and Unblock the Notifications