ధరలు తగ్గుముఖం: వెంకయ్య, టీకి హైద్రాబాద్, ఏపీకి చంద్రబాబు..
హైదరాబాద్: నరేంద్ర మోడీ హయాంలో ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం అన్నారు. తమ మొదటి ప్రాధాన్యం ప్రజాప్రయోజనాలకే అన్నారు. ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిలో పడిందని ఆయన చెప్పారు.
వెంకయ్య సనివారం తిరుపతిలో సీఐఐ ముగింపు సదస్సులో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు హైదరాబాదు ప్రత్యేక ఆకర్షణ అయితే, ఏపీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణ అన్నారు.
ఇక వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తిస్తూ విభజన చట్టంలో పేర్కొన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కేంద్రం త్వరలోనే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందన్నారు. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో చంద్రబాబు అంకితభావంతో పని చేస్తారని కితాబిచ్చారు.

రహదారులు, అంతర్జాతీయ విమానాశ్రయాలతో కనెక్టివిటీ ఉన్నందున రాష్ట్రంలో, ప్రత్యేకంగా రాయలసీమలో పారిశ్రామికవేత్తలు ఉత్పత్తితో పాటు మౌలిక సదుపాయాల కల్పన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలన్నారు.
పబ్లిక్-ప్రయివేటు భాగస్వామ్యంలోనే దేశంలో స్మార్ట్ సిటీల నిర్మాణం జరుగుతుందన్నారు. పన్నుల వసూలుతోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సాధ్యమన్నారు. చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థపాలనతో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీయులు ఆసక్తి చూపుతున్నారన్నారు.
గత ప్రభుత్వాలు ఉచితం పేరు చెప్పీ ఏదీ సరిగా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఏపీలో వెయ్యి కిలోమీటర్ల కోస్తా తీరం ఉందని, బెంగళూరు - చెన్నై పారిశ్రామిక కారిడారులో కృష్ణపట్నాన్ని చేర్చామన్నారు. విజయవాడ సమీపంలో కొత్త రాజధాని రానుందని, పెట్టుబడి పెట్టే వారికి తగిన ప్రోత్సాహం ఇచ్చేందుకు బాబు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు అన్నారు.












Click it and Unblock the Notifications