వెంకయ్య లాజిక్.. : పార్టీలు వీక్ గా ఉన్నా.. నేతలు గెలవాలంటే..
హైదరాబాద్ : ఎన్నికల్లో గెలవాలంటే.. ఏ నేతకైనా ప్రజా సంబంధాలు చాలా ముఖ్యం. ప్రజా సమస్యలు తెలిసి జనంలోకి చొచ్చుకెళ్లగలిగే నేతలకే ప్రజలు పట్టం కడుతారు. సరిగ్గా ఇవే విషయాలను ప్రస్తావించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పార్టీలు బలహీనంగా ఉన్నా.. నేతల ప్రజా సంబంధాలు మెరుగ్గా ఉంటే పార్టీతో సంబంధం లేకుండా ప్రజలే గెలిపిస్తారని వ్యాఖ్యానించారు.
కాగా, నాలుగోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తొలిసారి హైదరాబాద్ లో అడుగుపెట్టిన సందర్భంగా పలువురు నేతలు ప్రత్యేక ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు. మాదాపూర్‌లోని ఇమేజ్ గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు వెంకయ్య రాజకీయ ప్రస్థానంపై ప్రశంసలు కురిపించారు.

ఇదిలా ఉంటే, సభలో ప్రసంగించిన వెంకయ్య నాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి పనిచేశాను గనుకే ఈరోజు బీజేపీలో ఇంత మంచి పేరు తెచ్చుకోగలిగానని పేర్కొన్నారు వెంకయ్య. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు భవిష్యత్తులో వాజ్ పేయి, అధ్వానీ లాంటి నేతల పక్కన కూర్చుంటానని ఎన్నడూ ఊహించలేదన్నారు.
రాజకీయ జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా.. నిబద్దతతోనే ముందుకెళ్లానని. ఆ నిబద్దతతే తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించిదని చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా మరో కీలక వ్యాఖ్య కూడా చేసిన వెంకయ్య 'ఇకపై పరోక్ష ఎన్నికల్లోను పోటీ చేయను' అని ప్రకటించడం గమనార్హం.
దీనిపై వివరణ ఇస్తూ.. ప్రజా సేవకు పదవులతో పని లేదని చెప్పారు. అలాగే ప్రస్తుత రాజకీయమంతా ప్రజానుగుణంగా మారాలని, సమాజంలోని అన్ని వర్గాల్లో అభివృద్ధి సాధ్యపడాలంటే రాజకీయ నేతలంతా తమ దృక్పథాన్ని మార్చుకోవాలని సూచించారు.
ఇక ప్రాంతీయత గురించి ప్రస్తావిస్తూ.. ప్రాంతాలతో సంబంధం లేకుండా భారతీయుడినని చెప్పుకోవడానికే తాను ఇష్టపడుతానన్నారు. రాజకీయాల్లో తనకు పదవి గండం ఉందని ఎంతోమంది ఊదరగొట్టారని, అవన్నీ వాళ్ల ఊహాగాలకే పరిమితమయ్యాయే తప్ప అలాంటిదేమి జరగలేదన్నారు.

గత రాజకీయాల గురించి చెప్పుకొస్తూ.. 1983 సమయంలో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, ఎన్టీఆర్ హవా నడుస్తున్న సమయంలోను తాను నెల్లూరు జిల్లా నుంచి విజయం సాధించినట్టుగా చెప్పుకొచ్చిన వెంకయ్య, ప్రజల్లొ తనకున్న సంబంధాలే టీడీపీ హవాను సైతం నిలువరించి తనను గెలిపించాయని పేర్కొన్నారు. అలాగే రాజకీయాల్లో ఏ నేతకైనా ఓపిక చాలా అవసరమని సూచించారు.
వెంకయ్యపై నేతల ప్రశంసల జల్లు :
కార్యక్రమంలో వెంకయ్య సేవల గురించి మాట్లాడిన ఎంపీ మురళీ మోహన్.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి వెనుక వెంకయ్యనాయుడు చేసిన కృషి మరువలేనిదన్నారు. వెంకయ్య లాంటి నేతలు తెలుగు గడ్డ మీద పుట్టినందుకు తెలుగు ప్రజలంతా గర్వపడాలన్నారు.
ఇక మరో కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. రాజకీయాల్లో వెంకయ్య నాయుడు తనదైన మార్క్ చూపించారని చెప్పారు. నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా వెంకయ్యకు ఆత్మీయ అభినందనలు తెలిపారు దత్తాత్రేయ.

అలాగే ఆత్మీయ సభకు హాజరైన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కూడా వెంకయ్య నాయుడుని పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రస్తుతం పార్టీలు మారుతున్న నేతలంతా వెంకయ్య నాయుడిని చూసి నేర్చుకోవాలన్నారు. ఆయన రాజకీయ వైఖరి, పార్టీలు ఫిరాయించే వాళ్లకు కనువిప్పు కలిగించేదిగా ఉంటుందన్నారు. ప్రజల కోసం అహర్నిశలు కష్టపడ్డ వెంకయ్య ప్రజల్లో నిలిచిపోయే నాయకుడని కితాబిచ్చారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు మనోహర్ పారికర్, బండారు దత్తాత్రేయతో పాటు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సినీ ప్రముఖులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, అల్లు అరవింద్, నాగార్జున, రాఘవేంద్రరావు, డి.సురేశ్ తదితరులు హాజరై వెంకయ్య నాయుడుకు అభినందనలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications