టీడీపీలో చేరడంపై క్లారిటీ ఇచ్చిన ఆనం రామనారాయణరెడ్డి
Ysrcp ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నానని, తాను పోటీచేసే విషయం చెప్పాల్సింది తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ముందుగానే ఏదేదో ఊహించుకొని ఇక్కడే పోటీచేస్తాను.. అక్కడ పోటీచేస్తానంటూ చెప్పడం కూడా సరికాదన్నారు. ప్రస్తుతం వెంకటగిరికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకు ఆ అర్హత ఉందన్నారు. అయితే ఇక్కడి నుంచి ఎవరు పోటీచేయాలనేది జగన్ నిర్ణయమే ఫైనల్ అన్నారు.
మీడియాలో వస్తున్నట్లుగా తనకు వేరే ఆలోచన ఉంటే.. ఆ మాట తన నోటినుంచి రాబోయే ముందు కాగితం పక్కనపెట్టి చెబుతానన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై అప్పటివరకు ఎవరికీ ఏ అనుమానం అక్కర్లేదని చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ మొత్తం ఏక నాయకత్వం కిందే నడుస్తోందని, అప్పుడు సమస్య అనేదే రాదన్నారు. తనకు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండేందుకే టికెట్ ఇచ్చారని, ఈ ఐదు సంవత్సరాల చివరి రోజు వరకు వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతానన్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉందని, వెంకటగిరి అభివృద్ధిపై అందరూ కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా ఉన్న చివరి రోజు వరకు నియోజకవర్గానికి న్యాయం చేయడానికే తాను ప్రయత్నిస్తానన్నారు.

ఆనం రామనారాయణరెడ్డి రానున్న ఎన్నికల్లో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరతారని, ఆత్మకూరు నుంచి పోటీచేస్తారంటూ మీడియాల్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆయన ఎప్పుడూ ఖండించలేదు. మొదటిసారిగా వీటిపై మాట్లాడారు. వేరే ఆలోచన ఉంటే కాగితం పక్కనపెట్టి చెబుతానంటూ ఒక హింట్ ఇచ్చినట్లైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications