విభజన, వెంకటేశ్వర స్వామి అందుకే నన్ను రక్షించాడు: బాబు, ప్రాంతాల మధ్య చిచ్చు యత్నం
చిత్తూరు: 2003లో తనను కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి బతికించాడని, విభజన అనంతరం కష్టాల్లో ఉన్న ఏపీని బాగు చేయాలనే తను స్వామివారి ఆశీర్వదించి, బతికించారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు.
చిత్తూరు జిల్లా తిరుపతిలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న టిడిపి దిశా నిర్దేశ సదస్సును శుక్రవారం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీని, ప్రజలను అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
లోటు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తన పైన ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా తయారు చేయడమే లక్ష్యమన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. 2022 నాటికి భారత్‌లోని మూడు అగ్రరాష్ట్రాల్లో ఏపీ ఉండాలని ఆకాంక్షించారు.

హంద్రీనీవా ద్వారా రాబోయే జూన్ నాటికి చిత్తూరుకు నీళ్లు వస్తాయన్నారు. ఆరున్నర నెలల్లో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం చేసిన ఘనత టిడిపిదే అన్నారు. ఇటీవల తుపాను వల్ల ఎనిమిది మంది మృతి చెందారని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. ఈ ఏడాది కూడా సంక్రాంతి కానుక ఇస్తామని చెప్పారు.
కొందరు చిచ్చు పెట్టే ప్రయత్నం
తమ ప్రాంతానికి అన్యాయం అంటూ కొందరు కొత్త గళం విప్పుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన పరోక్షంగా చంద్రబాబు మండిపడ్డారు. కొందరు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమ ప్రాంతానికి అన్యాయం అంటూ కొత్త గళం విప్పుతున్నారన్నారు. ఏ జిల్లాను వదలమని, అన్నింటిని అభివృద్ధి చేస్తామన్నారు. బాక్సైట్ తవ్వకాల అంశం ఎవరి హయాంలో జరిగిందో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications