అసెంబ్లీ లో జగన్- రాయలసీమలో చంద్రబాబు-అయినా కలవరింతలు కామన్-పెరుగుతున్న డోస్
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న రాజకీయ పోరులో సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు పరస్పరం ఒకరి గురించి మరొకరు మాట్లాడకుండా ఉండలేని పరిస్ధితికి వచ్చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా వారిద్దరూ ప్రత్యర్ధుల పేరు తల్చుకోకుండా ప్రసంగాలు సైతం చేయలేకపోతున్నారు. తాజాగా టీడీపీ అసెంబ్లీ బహిష్కరణ తర్వాత నిత్యం వీరిద్దరూ తమ ప్రసంగాల్లో, మాటల్లో ప్రత్యర్ధుల్ని విమర్శిస్తూ, వారి విమర్శలకు కౌంటర్లు ఇస్తూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో వీరి విమర్శల్లో డోస్ కూడా అంతకంతకూపెరుగుతోంది. ఇది ఎంతవరకూ వెళ్తుందో ఎవరూ చెప్పలేని పరిస్ధితి.

జగన్ వర్సెస్ చంద్రబాబు
ఏపీలో జగన్ వర్సెస్ చంద్రబాబు పోరుకు దాదాపు దశాబ్దానికి పైగా చరిత్ర ఉంది. జగన్ తొలిసారి కడప నుంచి ఎంపీగా గెలిచే నాటికి చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నారు. సీన్ కట్ చేస్తూ ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత కూడా విపక్ష నేత స్ధానంలోనే ఉన్నారు. దీంతో చంద్రబాబుపై జగన్ పోరాటం కూడా అలాగే కొనసాగుతోంది. అదే సమయంలో చంద్రబాబు కూడా విపక్ష నేతగా ఉన్నా తనకున్న బలంతో జగన్ ను టార్గెట్ చేస్తూనే వచ్చారు. ఇప్పటికీ వీరిద్దరి మధ్య అదే స్ధాయిలో పోరు కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీలో ఉన్నా, జనంలో ఉన్నా జగన్, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం మాత్రం కామన్ గా మారిపోతోంది.
దీంతో ఏపీలో పొలిటికల్ హీట్ అంతకంతకూ పెరుగుతోంది.

కుప్పం గెలిచాక మరింతగా
తాజాగా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీపై వైసీపీ సాధించిన విజయం చంద్రబాబుకు ఎదురుదెబ్బగా మారిపోయింది. అదే సమయంలో అసెంబ్లీలో జగన్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి చంద్రబాబు మొహం చూడాలని జగన్ కలవరిస్తూ వచ్చారు. అసెంబ్లీ మొదటిరోజు బీఏసీ సమావేశంలో చంద్రబాబు వస్తున్నారా లేదా అని ఎంక్వైరీ చేసిన జగన్.. ఆ రోజు సాయంత్రం వరకూ అసెంబ్లీలో చంద్రబాబు వస్తారని ఎదురుచూశారు. అయినా చంద్రబాబు రాకపోవడంతో ఆపుకోలేక చంద్రబాబు కోసం ఎదురుచూశామని బహిరంగంగానే చెప్పేశారు. చివరికి అసెంబ్లీ సమావేశాల రెండోరోజు ఆ సందర్భం రానే వచ్చింది. చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు టార్గెట్ చేస్తుంటే జగన్ చిరునవ్వులు చిందిస్తూ అసెంబ్లీలో కనిపించారు. అప్పుడు చంద్రబాబు అసెంబ్లీ బహిష్కరణ చేసి వెళ్లిపోయినా ఇంకా వీరి మధ్య మాటల యుద్దం మాత్రం అలాగే కొనసాగుతోంది.

చంద్రబాబు అసెంబ్లీ బహిష్కరించినా
చంద్రబాబు తనపై, తన భార్య భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మనస్తాపానికి గురై అసెంబ్లీని బహిష్కరించి వెళ్లిపోయారు. ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుంటానని, సీఎంగానే తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత రాయలసీమలో వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి బాధితుల్ని ఓదార్చే క్రమంలో తిరిగి జగన్ పై విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు కూడా హద్దులు దాటిపోతున్నాయి. జగన్ తండ్రి వైఎస్సార్ మృతి ప్రమాదాన్ని గుర్తు చేస్తూ గాల్లో వాడు గాల్లోనే పచ్చిపోయాడు, గాల్లోనే పోతాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో జగన్ కు చిర్రెత్తుకొస్తోంది. దీంతో అసెంబ్లీలోనే ఆయన చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. అసలు టాపిక్ తో సంబంధం లేకుండా పదే పదే చంద్రబాబు ప్రస్తావన తెచ్చేస్తున్నారు.

జగన్ కు చిర్రెత్తుకొచ్చి అసెంబ్లీలో
జగన్ కూడా ఏమీ తక్కువ తినలేదు. చంద్రబాబు అసెంబ్లీలో జరిగిన అవమానంపై కన్నీళ్లు పెట్టుకున్న సమయంలో అసెంబ్లీలో మాట్లాడిన సీఎం జగన్.. చంద్రబాబు డ్రామా అందరూ చూశారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత నందమూరి కుటుంబమంతా చంద్రబాబుకు మద్దతుగా రంగంలోకి దిగడంతో కొంత వెనక్కి తగ్గినట్లు కనిపించిన జగన్... ఆ తర్వాత మళ్లీ చంద్రబాబుపై విమర్శల దాడి పెంచేస్తున్నారు. చంద్రబాబు అసెంబ్లీలో లేకపోయినా ఉన్నట్లే భావించి విమర్శలు ఎక్కుపెడుతున్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ సభ్యులెవరూ అసెంబ్లీలో లేకపోయినా ఉన్నట్లే జగన్ విమర్శలు ఉంటున్నాయి. అంతే కాదు సీమ టూర్ లో చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యల్ని గుర్తుచేసుకుంటూ.. ఆయన సంస్కారానికి తన నమస్కారమంటూ ఇవాళ వ్యాఖ్యానించారు.

జగన్ బాటలోనే చంద్రబాబు
చంద్రబాబు, జగన్ మధ్య సాగుతున్న మాటల యుద్ధం, విమర్శల ధాటి చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత కాకరేపడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ ను ఎదుర్కొనేందుకు వైసీపీ బాటలో వెళ్తున్న చంద్రబాబు విమర్శల డోస్ పెంచేస్తున్నారు. ఇందంతా చూస్తుంటే ముల్లును ముల్లుతోనే తీసే వ్యూహాన్ని చంద్రబాబు ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. రెండేళ్ల పాటు సాధారణ విమర్శలతో సరిపెట్టిన చంద్రబాబు ఇప్పుడు తాను కూడా డోస్ పెంచేయడంతో పాటు టీడీపీ నేతల్ని కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. తద్వారా జగన్ సిలబస్ ను ఫాలో అయితే తప్ప ఆయన్ను ఎదుర్కోలేమనే భావనలోకి వచ్చేసినట్లు కనిపిస్తోంది. అటు జగన్ కూడా ఏమాత్రం తగ్గకుండా తనతో పాటు మంత్రులతోనూ చంద్రబాబుపై అదే స్ధాయిలో ఎధురుదాడిని కొనసాగిస్తున్నారు. అంతటితో సరిపెట్టకుండా చంద్రబాబుకు అండగా ఉన్న మీడియాను కూడా పదే పదే టార్గెట్ చేస్తున్నారు. తద్వారా ప్రజల్లో వీరిపై ఓ బలమైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలు లేకపోయినా వీరిద్దరి మాటలయుద్దం డోస్ పెరుగుతుండటం రాష్ట్రంలో భవిష్యత్ పరిణామాలకు సూచికగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications