సోనియా చిత్రానికి సమాధి: చిరంజీవి ఆగ్రహం, హెచ్చరిక
న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా తిరుపతిలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చిత్రానికి పలువురు సమైక్యవాదులు సమాధి కట్టి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలోకి స్వార్థపరులు ప్రవేశించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ చిత్రపటానికి తిరుపతిలో కొందరు సమైక్యవాదులు సమాధి కట్టడం సరికాదన్నారు. ఇది హేయకరమైన చర్య అని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను ఎవరు సమర్థించరని, ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తిరుపతిలో సోనియా చిత్రానికి సమాధి కట్టడంపై పలువురు కాంగ్రెసు నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

తిరుపతిలో సోనియా చిత్ర పటానికి పలువురు సమైక్యవాదులు సమాధి కట్టిన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఘాటైన లేఖ రాసిన విషయం తెలిసిందే. సోనియాకు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సమాధి కట్టడం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని లేఖలో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రెండు ప్రాంతాలలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరించే వారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
మరోవైపు కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ కూడా ఈ విషమయై మండిపడ్డారు. పోలీసులు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. బుధవారం ఉదయం ఆయన డిజిపికి ఫిర్యాదు చేశారు. సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications