TTD: బ్రోకర్లకు చుక్కలు చూపిస్తున్న విజిలెన్స్, ఎవరు భక్తులో, ఎవరు అధికారులో?
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో శ్రీవారి భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న దళారుల భరతం పట్టడానికి విజిలెన్స్ అధికారులు సిద్దం అయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా తిరుమలలో దర్శన టిక్కెట్లు, గదులను అధిక ధరకు విక్రయించిన దళారులు ఇప్పుడు కూడా అదే పద్దతిని అమలు చేస్తున్నారని సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారులు నిఘా వేశారు.
టీటీడీ ఈవోగా జే శ్యామలరావు బాధ్యతలు స్వీకరించిన తరువాత తిరుమలలో దళారులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాల మేరకు దళారీవ్యవస్థను నిర్మూలించడమే లక్షంగా విజిలెన్స్, పోలీసు శాఖ చర్యలు తీసుకుంటున్నది. టీటీడీ సీవీఎస్ వో నరసింహ కిశోర్, డీఎస్పీ శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో తిరుమలలో దళారీలను గుర్తించడానికి గట్టి నిఘా వేశారు.

తిరుమలలోని వైకుంఠం 1, వైకుంఠం 2, సీఆర్వో, ఎంబీసీ 34, రాంభగీజా తదితర ప్రాంతాల్లో తిరుగుతున్న దళారీలను గుర్తించి వారి మీద కేసులు నమోదు చెయ్యడానికి సిద్దం అయ్యారు. జూన్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు దళారీలను పట్టుకున్న పోలీసులు వారి మీద 13 కేసులు నమోదు చేసి 11 చార్జ్ షీట్లు నమోదు చేశారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు చెయ్యడంతో తిరుమల పోలీస్ స్టేషన్ లో ఆ దళారీల మీద కేసులు నమోదు చేశారు.
తిరుమలలో 2019 నుంచి 2024 వరకు 279 కేసులు నమోదు కావడంతో ఆ కేసుల్లో 589 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటి వరకు 208 మందిని అరెస్టు చేసిన పోలీసులు మిగిలిన 337 మందికి సీఆర్ పీసీ నోటీసులు జారీ చేశారు. మరో పది మంది నిందితులను గుర్తించాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. ముఖ్యంగా తిరుమలలో కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన నిఘా వేసి దళారులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

టీటీడీ ఐటీ విభాగం ద్వారా భారీగా గదులు పొందిన వారిని, ఇతర అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. నకిలీ ఆధార్ కార్డులతో శ్రీవారి సుప్రభాతం టిక్కెట్లు కొనుగోలు చేసిన నిందితులను, రూ. 50, రూ 100 గదులు బుక్ చేసుకుని వాటిని రూ. 1,000 విక్రయిస్తున్న నిందితులను గుర్తించడానికి విజిలెన్స్ అధికారులు, పోలీసులు మఫ్టీలో తిరుమలలో సంచరిస్తున్నారు.
తిరుమలలో దళారీల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. తిరుమల నుంచి ప్రక్షాళన మొదలౌతుందని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డీసీఎం పవన్ కల్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాల నుంచి తిరుమలలో సామాన్య భక్తులను దళారులు నిలువునా ముంచేస్తున్నారని అనేక ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే












Click it and Unblock the Notifications