రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు- ఆధారాలతో సహా.. ఇక నెక్స్ట్..!!
ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు.. కేసుల్లో వైసీపీ నేతలు వరుసగా అరెస్ట్ అయ్యారు. లిక్కర్ కేసులో ఏడాది తరువాత తాజాగా రాజ్ కేసిరెడ్డికి బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అవినీతి పైన విచారణ చేసిన విజిలెన్స్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో మాజీ మంత్రి రోజా.. బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి పాత్ర పైన పూర్తి ఆధారాలు సమర్పించినట్లు సమాచారం. దీంతో.. ఇప్పుడు ఈ ఇద్దరి పైన ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా కసరత్తు చేస్తోంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ''ఆడుదాం.. ఆంధ్రా'' పై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘకాలంపాటు లోతైన విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు.. అవినీతిలో అప్పటి క్రీడాశాఖ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కీలక పాత్ర పోషించారని నిర్ధారించారు. వీరిద్దరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. వీరితో పాటు అప్పటి శాప్ ఇన్‌చార్జి ఎండీ హర్షవర్ధన్‌పైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేశ్‌కుమార్, మరో ఐఏఎస్ అధి కారి ధ్యాన్‌చంద్‌తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి వాణీమోహన్‌పైనా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. శాప్‌లోని ఐటీ విభాగంలో పనిచేసే వారు సైతం ఈ అవినీతికి పూర్తిగా సహకరించారని, వారిపైనా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్రీడా పరికరాల కొనుగోలు దగ్గర నుంచి ఆటగాళ్లకు కల్పించే వసతి, భోజనాల్లోనూ భారీగా దోచేసినట్టు విజిలెన్స్ నివేదికలో ప్రభుత్వానికి వివరించారు. ఎన్నికల కోసమే ఈ డ్రామాలంటూ అప్పట్లోనే విమర్శలొచ్చాయి. రూ.40 కోట్ల అంచనాలతో ప్రారంభమైన 'ఆడుదాం.. ఆంధ్రా' పూర్తయ్యేసరికి రూ.100 కోట్లుపైనే ఖర్చు తేలింది. ఇంత భారీ ఖర్చుపై అప్పట్లోనే అనేక అనుమానాలు తలెత్తాయి.

విజిలెన్స్ నివేదిక పై ప్రభుత్వ నిర్ణయం
కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత ఎమ్మెల్యేల ఫిర్యాదులతో స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విచారణలో విజిలెన్స్ అధికారులు 600కి పైగా ప్రాంతాల్లో వందలాది మందిని విచారించారు. 30వేల పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ క్రమంలో ఆడుదాం.. ఆంధ్రా పేరిట మొత్తం రూ.40 కోట్ల మేరకు నిధులు దుర్వి నియోగమైనట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించినట్టు తెలిసింది. కొన్ని జిల్లాల్లో గ్రామస్థాయిలో క్రీడలకు రూ.10 వేలు కేటాయిస్తే.. తమ సొంత నిధులు మరో రూ.10వేలు ఖర్చయ్యాయంటూ మొత్తం రూ.20 వేలు ఖర్చు చూపించారు. ఇలా ప్రతిస్థాయిలోనూ కేటాయింపుల కంటే రెండింత లు ఖర్చు చేసినట్లు చూపించారు. పోటీల్లో విజేతలంతా వైసీపీ కార్యకర్తలే అని విజిలెన్స్ విచారణ లో తేల్చినట్లు సమాచారం. విజిలెన్స్ నివేదిక అందటంతో ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యవహారం పై ఏసీబీ లేదా సీఐడీ ద్వారా విచారణ కు ఆదేశించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications