'ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబు దేశం విడిచిపోయే ఛాన్స్', అంబులెన్స్‌పై జగన్ సెల్ఫ్‌గోల్!
అమరావతి/విశాఖపట్నం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతి చక్రవర్తి అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి సోమవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో నాలుగున్నర లక్షల కోట్ల అవినీతికి చంద్రబాబు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు, లోకేష్ పాస్ పోర్టులు సీజ్ చేయండి
వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే, చంద్రబాబు, లోకేష్ అవినీతి సొమ్ముతో దేశం దాటిపోయే ప్రమాదం ఉందని విజయసాయి రెడ్డి హెచ్చరించారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కొడుకు, మంత్రి నారా లోకేష్ పాస్‌పోర్టులను సీజ్ చేయాలని సూచించారు. ఏపీలో అరాచక పాలన సాగుతోందని మరో వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. నాలుగున్నరేళ్లలో దోచుకోవడం తప్ప టీడీపీ చేసిందేమీ లేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు.

వైసీపీ కార్యకర్తలే 108కి ఫోన్ చేశారు
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని బహిరంగసభలో ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంబులెన్స్ పైన సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి దేవనేని ఉమామహేశ్వర రావు స్పందించారు. జగన్ సభకు హాజరయ్యేందుకు వైసీపీకి చెందిన కార్యకర్తలు లారీల్లో వచ్చారని, ఓ కార్యకర్త లారీ నుంచి కిందకు దిగుతున్న సమయంలో ఓ ఆటో అతనిని ఢీకొందని చెప్పారు. అతను తీవ్రంగా గాయపడటంతో పక్కనే ఉన్న వైసీపీకార్యకర్తలే 108కి ఫోన్ చేశారని చెప్పారు.

ఆసుపత్రికి పోయింది వైసీపీ కార్యకర్తే
ఆ అంబులెన్సులో ఆసుపత్రికి పోయింది మీ పార్టీ కార్యకర్తేనని దేవినేని.. జగన్‌ను ఉద్దేశించి అన్నారు. ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడని చెప్పారు. మీ కార్యకర్తను రక్షించేందుకు అంబులెన్సు వస్తే ప్రభుత్వం వికృతమైన చర్యకు దిగింది అంటారా అని ధ్వజమెత్తారు. అంబులెన్సు వెళ్లడానికి మరో దారి లేకపోవడం వల్లే, సభ జరుగుతున్న దారి గుండా వెళ్లాల్సి వచ్చిందన్నారు.

జగన్ సెల్ఫ్ గోలా?
ఇరుకు సందులలో సభలు పెట్టడం ఏమిటని జగన్‌ను దేవినేని ప్రశ్నించారు. జగన్ మాట్లాడిన భాష సరిగా లేదన్నారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంటే, జగన్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. కాగా, దేవినేని చెప్పినట్లు అదే వాస్తవమైతే జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications