క్షీణించిన జ్ణాపకశక్తి చంద్రబాబుకు సంజీవని ; పులిచింతల పైన బాబు బతుకు నివేదిక బయటపెట్టిందన్న సాయిరెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు. ప్రతినిత్యం చంద్రబాబును విమర్శిస్తూ, తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని, భవిష్యత్తులో టిడిపి ఏపీలోఉండబోదని వ్యాఖ్యలు చేస్తున్న విజయసాయి రెడ్డి తాజాగా చంద్రబాబుకు మతిమరుపు ఓ వరం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మళ్లీ అధికారంలోకి వస్తామన్న భ్రాంతిలో ఉండటం మతిమరుపు పుణ్యమే
క్షీణించిన జ్ఞాపకశక్తి చంద్రబాబుకు సంజీవనిగా పనిచేస్తోందని, ఆయనకు మతిమరుపు ఒక వరం అంటూ విజయ సాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు మున్సిపల్, పంచాయతీ, తిరుపతి బై ఎలక్షన్స్ తో పాటుగా తాజాగా ఏలూరు లో కొట్టుకుపోయినా మళ్లీ అధికారంలోకి వస్తామన్న భ్రాంతిలో ఉండటం మతిమరుపు పుణ్యమే అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తానన్న భ్రమలో బ్రతుకుతున్నారని సెటైర్లు వేశారు. అంతేకాదు చంద్రబాబు ప్రభుత్వం వదిలివెళ్లిన బకాయిల భారం రెండు లక్షల కోట్ల పైనే ఉందని, రాష్ట్రం టీడీపీ హయాంలోనే ఆర్థికంగా నిండా మునిగిపోయిందని వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి.

చంద్రబాబు వెళ్ళే సమయానికే అన్నీ బకాయిలే ..
రాష్ట్రంలో తక్షణ చెల్లింపులు జరపాల్సిన కాంట్రాక్టర్ల బిల్లులు, విద్యుత్ కొనుగోళ్ల బాకీలు, ఫీజు రియంబర్స్మెంట్ లు , ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇవ్వవలసినవి అన్ని బకాయిలు పెట్టి చంద్రబాబు వెళ్లిపోయారని, కానీ ఇప్పుడు పత్తి గింజల్లాగా సిగ్గులేని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. అంతేకాదు పులిచింతల గేటు పై అబద్ధాన్ని నిజం చేయడానికి ఎల్లోమీడియా, బాబు మనుషులు దుష్ప్రచారాన్ని ప్రారంభించారని మండిపడిన విజయసాయిరెడ్డి డ్యాం నింపే ముందు పాటించాల్సిన ప్రోటోకాల్ ను గాలికొదిలేసింది గత చంద్రబాబు ప్రభుత్వం అంటూ నిప్పులు చెరిగారు.

టీడీపీ హయాంలోనే పులిచింతలపై నివేదిక .. బాబు బతుకు బయటపెట్టింది
అధికార పార్టీ నిర్లక్ష్యం వల్లే పులిచింతల గేటు కొట్టుకు పోయిందని టిడిపి విమర్శిస్తుంటే, గత ప్రభుత్వ హయాంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. 2015 లోనే నిపుణులు ఇచ్చిన నివేదిక చంద్రబాబు బతుకుని బయటపెట్టిందని పేర్కొన్న విజయసాయిరెడ్డి, నాడు టిడిపి హయాంలోనే గేట్లు, తీగలు బలహీనంగా ఉన్నాయని నివేదికలో స్పష్టంగా వెల్లడించారని ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు టిడిపి నేతల బృందం నిజనిర్ధారణ నిమిత్తం వెళ్ళింది.

పులిచింతల సందర్శనకు వెళ్ళిన టీడీపీ నేతలు , అడ్డుకున్న పోలీసులు
టిడిపి నేత జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో పులిచింతలకు వెళ్ళిన బృందాన్ని అందరికీ అనుమతి లేదని మాదిపాడు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనకు నలుగురికి మాత్రమే అనుమతి ఉందని తెలిపిన పోలీసులు, టిడిపి నేతలను ప్రాజెక్టు సందర్శనకు వెళ్లకుండా నిలువరించారు. ఈ క్రమంలో పోలీసుల తీరును నిరసిస్తూ టిడిపి నేతలు ఆందోళన చేశారు. ఇక పులిచింతల సందర్శనకు వెళ్లిన టిడిపి సీనియర్ నేత జీవీ ఆంజనేయులు వైసిపి సర్కారుపై నిప్పులు చెరిగారు.

అవినీతికి అంబాసిడర్ వైఎస్ కుటుంబం అన్న జీవీ ఆంజనేయులు
అవినీతికి అంబాసిడర్ వైయస్ కుటుంబాన్ని జీవి ఆంజనేయులు మండిపడ్డారు. నేడు ఐదు లక్షల క్యూసెక్కుల నీటికే పులిచింతల గేటు కొట్టుకు పోయిందన్నారు. భవిష్యత్తులో ఏమేమి జరగనున్నాయో అంటూ అసహనం వ్యక్తం చేశారు. వార్షిక మెయింటెనెన్స్ కు కూడా నిధులు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. దీనిపై ప్రాజెక్టుల నిపుణుల కమిటీతో ప్రత్యేక అధ్యయనం చేయాలన్న జీవి ఆంజనేయులు, దోపిడీ చేసి టీడీపీ అధినేత చంద్రబాబును నిందిస్తున్నారు అంటూ నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications