సాయిరెడ్డి బెయిల్ రద్దు: షాకింగ్ ట్విస్ట్ -సీబీఐ తలూపినా, ఎంపీ ధిక్కారం? -జడ్జి ఫైర్! -రఘురామ కోరిందే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ జైలుకు పంపేదాకా రాష్ట్రంలో అడుగు పెట్టబోనని శపథం చేసిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ దిశగా చివరి మజిలికి చేరిన తర్వాత, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కూడా పిటిషన్ వేయడం తెలిసిందే. రెబల్ ఎంపీ దాఖలు చేసిన పిటిషన్ పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో మంగళవారం విచారణ జరగ్గా, అనూహ్య నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాలివి..

సాయిరెడ్డి పారిపోకుండా..
క్విడ్ ప్రోకో సంబంధిత కేసుల్లో నిందితులుగా ఉన్న సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలు తమ పదవులను అడ్డం పెట్టుకుని బెయిల్ షరతుల్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ, వాళ్ల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రెబల్ ఎంపీ రఘురామ హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. తన బెయిల్ రద్దు పిటిషన్ పై జగన్ కౌంటర్ దాఖలు చేయగా, సీబీఐ మాత్రం నిర్ణయాధికారాన్ని కోర్టుకే వదిలేసింది. దీనిపై గత నెలలోనే విచారణ పూర్తి చేసి తీర్పు కూడా సిద్ధం చేసిన సీబీఐ కోర్టు.. ఆ తీర్పును ఈనెల 25కు రిజర్వ్ చేసింది. ఈనెల 7వ తేదీన ఎంపీ రఘురామ తన సహచరుడు సాయిరెడ్డి బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. జగన్ బెయిల్ రద్దు నేపథ్యంలో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి విదేశాలకు పారిపోయే అవకాశాలున్నందున బెయిల్ రద్దు చేయాలని రెబల్ ఎంపీ కోరారు. అంతేకాదు..

బిల్డప్పులతో భయం పుట్టించేలా..
వైసీపీలో నంబర్ 2 నేత అయిన విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ విదేశాలకు పారిపోతారనే అనుమానంతోపాటు అనేక సంచలన అంశాలనూ పేర్కొన్నారు. వైసీపీ పార్లమెంటరీ నేత హోదాలో ఎంపీ విజయసాయిరెడ్డి నిత్యం కేంద్ర హోం, ఆర్థిక శాఖ కార్యాలయాల్లో కలియదిరుగుతూ.. తనకు కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయనే విధంగా చిత్రీకరించి.. జగన్ కేసుల్లో సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారని రఘురామ ఆరోపించారు. అంతేకాదు, విజయసాయిరెడ్డి ఎంపీ కాగానే .. సీఎం జగన్ ఆస్తుల కేసుల ప్రధాన దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన అధికారిని సీబీఐ జేడీ చేయవద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని, ఇది స్వేచ్ఛాయుత విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని, మాన్సాస్ వివాదంలో అశోక్ గజపతిరాజును జైలుకు పంపుతామని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం కూడా కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందన్న రఘురామ, వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలను పిటిషన్ కు జత చేశారు. అయితే, ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు..

బెయిల్ రద్దు విచారణ 13కు వాయిదా
రఘురామ వేసిన పిటిషన్ ను ఈనెల 7వ తేదీనే విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా విజయసాయిరెడ్డిని, సీబీఐని ఆదేశించింది. అందుకు మూడు రోజులు గడువిస్తూ, విచారణను ఈనెల 10కి(మంగళవారానికి) వాయిదా వేసింది. ఆ మేరకు ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరగ్గా, కౌంటర్ దాఖలుకు ఇంకొంత సమయం కావాలని కోర్టును సీబీఐ అభ్యర్థించింది. దర్యాప్తు సంస్థ అభ్యర్థనను మన్నించిన కోర్టు.. కౌంటర్ దాఖలుకు మరో మూడు రోజులు గడువిస్తూ విచారణను మరో మూడు రోజులకు, అంటే ఈనెల 13కు వాయిదా వేసింది. ఇక్కడ ట్విస్టింగ్ విషయమేంటంటే..

సీబీఐ సరేనన్నా, సాయిరెడ్డి ధిక్కారమంటూ.
విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు అంశానికి సంబంధించి హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఇవాళ ట్విస్టింగ్ పరిణామాలు జరిగినట్లు పలు మీడియా సంస్థల్లో రిపోర్టులు వచ్చాయి. ఈనెల 7న సీబీఐ కోర్టు పంపిన నోటీసులకు అనుగుణంగా సీబీఐ తరఫు లాయర్లు ఇవాళ కోర్టుకు హాజరై, కౌంటర్ దాఖలుకు సమయం కావాలని కోరారు. అయితే, విజయసాయిరెడ్డి తరఫు లాయర్లు విచారణకు హాజరయ్యారా? లేదా? అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో నోటీసులు తీసుకోడానికి ఎంపీ సాయిరెడ్డి నిరాకరించారని రఘురామ తరఫు లాయర్లు సీబీఐ కోర్టు దృష్టికి తీసుకొచ్చారని, సాయిరెడ్డి చర్యను ధిక్కారంగా పరిగణించాలని రఘురామ లాయర్లు కోరారంటూ మీడియాలో రిపోర్టులు వచ్చాయి. అంతేకాదు,

సాయిరెడ్డిపై సీబీఐ కోర్టు ఆగ్రహం?
బెయిల్ రద్దు కోరుతూ రఘురామ వేసిన పిటిషన్ పై తాము జారీ చేసిన నోటీసులకు విజయసాయిరెడ్డి స్పందన రాకపోవడంపై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని కూడా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఇవే నోటీసులకు సీబీఐ వారు స్పందించగా లేనిది, విజయసాయిరెడ్డి మాత్రం ఎందుకు స్పందించడంలేదని జడ్జి ఆగ్రహించారని, ఈనెల 13న సీబీఐతోపాటే సాయిరెడ్డి కూడా కౌంటర్ దాఖలు చేయాల్సిందేనని జడ్జి ఆదేశించారని, రఘురామ తరఫు లాయర్ల ద్వారా ఈ విషయం వెల్లడైందంటూ సదరు మీడియా రిపోర్టుల్లో రాసుంది. కోర్టులో సీబీఐ తరఫు వాదన(కౌంటర్ దాఖలుకు గడువు కోరడం) తప్ప విజయసాయిరెడ్డి వాదనలకు సంబంధించిన విషయాలేవీ పెద్దగా వెల్లడి కాకపోవడం మరింత గందరగోళానికి దారి తీసింది. నిజంగానే సీబీఐ కోర్టు నోటీసులకు సాయిరెడ్డి స్పందించలేదా? ఆ మేరకు ఎంపీపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారా? ఒకవేళ సాయిరెడ్డి స్పందించి ఉంటే కోర్టును ఏమని అభ్యర్థించారు? అనే విషయాలు స్పష్టంగా వెల్లడికావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే, రఘురామ కోరుతున్నట్లుగా కేసు ముగిసే అవకాశాలు లేకపోలేవు..












Click it and Unblock the Notifications