వైసీపీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో వెల్లడించిన భానుప్రకాష్ రెడ్డి
Vijayasai Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి.. రాజీనామా వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. వైఎస్ఆర్సీపీ మూల స్తంభాల్లో ఒకరిగా భావించే సాయిరెడ్డి ఏకంగా రాజకీయాల నుంచే వైదొలగడం ఆ పార్టీకి శరాఘాతంలా మారింది. క్యాడర్‌ను దిగ్భ్రాంతిలోకి నెట్టింది.
నేడు రాజీనామా..
రాజకీయాల నుంచి తప్పుకుంటోన్నానంటూ సాయిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తన రాజ్యసభ సభ్యత్వానికి నేడు రాజీనామా చేయనున్నారు. ఈ మధ్యాహ్నం ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కడ్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. అనంతరం ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించనున్నారు.

వైఎస్ కుటుంబంపై..
భవిష్యత్తులో ఏ రాజకీయపార్టీలోను చేరట్లేదని తెలిపారాయన. రాజీనామా నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతంమని, ఇందులో ఎలాంటి ఒత్తిళ్లూ లేవనీ తేల్చి చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా తనను ఆదరించిన వైఎస్ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. ఆ కుటుంబానికి రుణపడి ఉన్నాననీ వ్యాఖ్యానించారు.
ఆ రెండు పార్టీలపై..
రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో విభేదించానని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబంతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తోనూ తనకు చిరకాల స్నేహం ఉందంటూ విజయసాయిరెడ్డి చెప్సుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఇంకా మూడేళ్లు..
కాగా- 2028 జూన్ వరకూ రాజ్యసభ సభ్యుడిగా విజయసాయి రెడ్డి కొనసాగాల్సి ఉంది. ఆయన రాజీనామా చేయాల్సి రావడం వల్ల ఖాళీ అయ్యే స్థానానికి ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్లతో కలిపి రెండు- మూడు నెలల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ దీనికి నోటిఫికేషన్ ఇవ్వొచ్చు.
బీజేపీ నేత ఏం చెబుతున్నారు?
సాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత నెలకొని ఉందని, మున్ముందు ఆ పార్టీకి మనుగడ ఉండబోదని అన్నారు.
నమ్మకం లేదు..
పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై సొంత పార్టీలో విశ్వాసం సన్నిగిల్లిందని భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. జగన్ అనుసరించిన ప్రజా వ్యతిరేకత విధానాల వల్ల గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి 11 సీట్లు మాత్రమే దక్కాయని, ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు.
చాలామంది వస్తారు..
ఇప్పటికే ముగ్గురు ఎంపీలు వైఎస్ఆర్సీపీ నుంచి బయటికొచ్చారని, విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి వంటి వాళ్లు వీడబోతోన్నారని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. మున్ముందు ఆ పార్టీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. నాయకుడనే వాడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, జగన్ దీనికి భిన్నంగా వ్యవహరించాడని విమర్శించారు. ఎప్పుడూ గాల్లో తిరిగే వాడని, అందుకే గాల్లోనే పెట్టారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications