ఢిల్లీ కాలింగ్: అన్నయ్యకు రూట్ క్లియర్- రెడ్ కార్పెట్?
Megastar Chiranjeevi: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి.. రాజీనామా వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. వైఎస్ఆర్సీపీ మూల స్తంభాల్లో ఒకరిగా భావించే సాయిరెడ్డి ఏకంగా రాజకీయాల నుంచే వైదొలగడం ఆ పార్టీకి శరాఘాతంలా మారింది. క్యాడర్‌ను దిగ్భ్రాంతిలోకి నెట్టింది.
నేడు రాజీనామా..
రాజకీయాల నుంచి తప్పుకుంటోన్నానంటూ సాయిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తన రాజ్యసభ సభ్యత్వానికి నేడు రాజీనామా చేయనున్నారు. ఈ మధ్యాహ్నం ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కడ్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. అనంతరం ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. మహా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించనున్నారు.

నాలుగు దశాబ్దాలుగా..
భవిష్యత్తులో ఏ రాజకీయపార్టీలోను చేరట్లేదని తెలిపారాయన. రాజీనామా నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతంమని, ఇందులో ఎలాంటి ఒత్తిళ్లూ లేవనీ తేల్చి చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా తనను ఆదరించిన వైఎస్ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. ఆ కుటుంబానికి రుణపడి ఉన్నాననీ వ్యాఖ్యానించారు.
టీడీపీ, జనసేన గురించి..
రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో విభేదించానని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబంతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తోనూ తనకు చిరకాల స్నేహం ఉందంటూ విజయసాయిరెడ్డి చెప్సుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
2028 జూన్ వరకూ..
కాగా- 2028 జూన్ వరకూ రాజ్యసభ సభ్యుడిగా విజయసాయి రెడ్డి కొనసాగాల్సి ఉంది. ఆయన రాజీనామా చేయాల్సి రావడం వల్ల ఖాళీ అయ్యే స్థానానికి ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీట్లతో కలిపి రెండు- మూడు నెలల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ దీనికి నోటిఫికేషన్ ఇవ్వొచ్చు.

చిరంజీవికి కేటాయించే అవకాశం?
సాయిరెడ్డి రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయ్యే స్థానాన్ని మెగాస్టార్ చిరంజీవికి కేటాయించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. చిరంజీవి రాజ్యసభకు ఎంపిక కావడం ఖాయమంటూ ఇదివరకే వార్తలొచ్చాయి. వీటిని ఆయన తోసిపుచ్చలేదు.
కూటమితో సఖ్యత..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటోన్నారు చిరంజీవి. కూటమిలో ఢిల్లీ స్థాయిలో మున్ముందు కీలక పాత్ర పోషించవచ్చనే చర్చలకూ తెర తీశారు.
కాంగ్రెస్ నుంచి..
రాజ్యసభకు ఎంపిక కావడం మెగాస్టార్‌కు కొత్తేమీ కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దల సభలో అడుగుపెట్టారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు బీజేపీ తరఫున మళ్లీ రాజ్యసభలో ఎంట్రీ ఇవ్వొచ్చని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయం కండువా కప్పుకోవచ్చనీ అంటున్నారు.












Click it and Unblock the Notifications