అప్పుడు ఎన్టీఆర్‌కు.. ఇప్పుడు మోడీకి.. చంద్రబాబు వెన్నుపోటు: విజయసాయి రెడ్డి
'టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుకు ఉందని, ఇప్పుడు మోడీని కూడా వెన్నుపోటు పొడుస్తున్నారని' విమర్శించారు.
విజయవాడ: ఏపీలో రెండు ప్రధాన పార్టీలు నిత్యం ఆరోపణలు ప్రత్యారోపణలతో మాటల యుద్దానికి దిగుతున్నాయి. సందర్భం వచ్చిన ప్రతీసారి ఇరు వర్గాల నేతలు ఢీ అంటే ఢీ అన్న తరహాలో వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
ఆరోపణలు చేసుకోవడం ఒకరి వంతైతే.. బురద జల్లేందుకే ఇలాంటివి చేస్తున్నారని కౌంటర్ ఇవ్వడం మరొకరి వంతు. ఇంచుమించుగా రెండు పార్టీల మధ్య ఆరోపణల పర్వం ఇలాగే సాగుతూ వస్తోంది.
తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.విశాఖపట్నంలో నిర్వహించిన వైసీపీ మినీ ప్లీనరీలో భాగంగా.. చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు.

అధికారం ఉంది కదా అని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని విమర్శించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రైతుల వద్ద భూముల్ని తీసుకుని దందాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రస్తుతం రాష్ట్రమంతా అవినీతి పాలనే జరుగుతోందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇక సీఎం గురించి ప్రస్తావిస్తూ.. గతంలో 'టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుకు ఉందని, ఇప్పుడు మోడీని కూడా వెన్నుపోటు పొడుస్తున్నారని' విమర్శించారు.
ఇక మంత్రి లోకేష్ విశాఖ టూర్ పై కూడా విజయసాయిరెడ్డి మండిపడ్డారు. భూదందాల్లో ఆయనపై ఆరోపణలు ఉన్నందువల్ల.. ఆ వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకే ఇక్కడికి వస్తున్నారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications