రామోజీరావుకు వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి మాస్టర్ ప్లాన్!
మీడియా మొఘల్‌గా పేరు తెచ్చుకున్న రామోజీరావు పత్రికా రంగంలో ఈనాడు దినపత్రికను విజయవంతంగా నడిపిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఆయన తెలుగు రాజకీయాలను శాసిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై గతంలో పోరాటం జరిపారు. ప్రస్తుతం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోరాటం చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీతో తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకోవడానికి రామోజీరావు కూడా ఓ ప్రధాన కారణమని భావిస్తున్నారు. వైఎస్ హయాంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ సంబంధించి కేసులు నమోదయ్యాయి.
ముల్లును ముల్లుతోనే తీస్తా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు నుంచి ఎంపీగా పోటీచేస్తున్న విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఈనాడులో కథనాలు వచ్చాయి. దీనిపై సాయిరెడ్డి సీరియస్ అయ్యారు. రామోజీరావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. త్వరలో తాను కూడా మీడియా రంగంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. రామోజీరావును రాము అని సంభోదిస్తూ ఆయన అంతు తేలుస్తానన్నారు. నీ మీడియాను తన మీడియాతో ఢీకొడతానని, ముల్లును ముల్లుతోనే తీస్తానంటూ తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాదు రామోజీరావు సీబీఐ ఎంక్వయిరీకి సిద్ధంగా ఉండాలన్నారు.

గతంలో కూడా చెప్పిన సాయిరెడ్డి
విజయసాయిరెడ్డి గతంలో కూడా మీడియాను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారుకానీ ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదే. దినపత్రికతోపాటు ఛానల్ ఏర్పాటు చేస్తారంటూ ప్రచారం జరిగింది. రామోజీరావుపై ఉన్న కోపంతో వ్యాపార కోణంలో మీడియాను ఏర్పాటు చేస్తానని తాజాగా ప్రకటించడం ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీకి సాక్షి దినపత్రిక, ఛానల్ ఉన్నాయి. టీవీ9, ఎన్ టీవీ మద్దతుగా ఉన్నాయి. సాయిరెడ్డి మీడియా ఏర్పాటు చేస్తానని ప్రకటించిన తరుణంలో కొత్తగా సంస్థలను ఏర్పాటు చేస్తారా? లేదంటే ఉన్న మీడియా సంస్థల్లో ఒకదాన్ని టేకోవర్ చేసి నడిపిస్తారా? అనే విషయంలో స్పష్టత రాలేదు. దినపత్రిక అంటే విపరీతమైన ఖర్చుతో కూడుకున్నది. ఒకరకంగా చెప్పాలంటే నోట్లు విసిరేసి చిల్లర ఏరుకోవడం లాంటిదని వ్యాపార కోణంలో చెబుతారు. అందుకే ఈ రంగంలోకి ఎవరూ రారు. మరి సాయిరెడ్డి ఏమైనా వస్తారేమో చూడాలి.












Click it and Unblock the Notifications