వల్లభనేని వంశీకి భారీ షాక్-కస్టడీపై విజయవాడ కోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఈ కేసులో ఫిర్యాదు దారుగా ఉన్న దళిత యువకుడు సత్యవర్ధన్ ను బెదిరించిన వ్యవహారంలో వంశీని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో వంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చారు. అయితే ఈ కేసులో ఫిర్యాదు దారుగా ఉన్న టీడీపీ ఆఫీసు కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఉన్నట్లుండి ఫిర్యాదు వెనక్కి తీసుకున్నాడు. దీంతో ఏం జరిగిందని పోలీసులు ఆరా తీస్తుండగా అతని సోదరుడు, తల్లి అతన్ని వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించినట్లు తెలిపారు. దీంతో మరో కేసు నమోదు చేసిన పోలీసులు వంశీని ఏ1గా చేర్చి అరెస్టు చేశారు. మరో ఇద్దరు అనుచరుల్ని కూడా అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.
ఈ కేసులో వంశీని కస్టడీకి ఇచ్చే తప్ప వాస్తవాలు బయటికి రావని పోలీసులు విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో వాదించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. వంశీని మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయవాది సమక్షంలో వంశీని విచారించేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో వంశీ వెన్నునొప్పితో బాధపడుతున్నందున జైల్లో మంచం ఏర్పాటు చేసేందుకు కూడా అనుమతి ఇచ్చింది. దీంతో వంశీని రేపు జైలు నుంచి కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications