బెజవాడ దుర్గమ్మ చెంతకు పోటెత్తిన భవానీలు.. నేటి నుండే భవానీ దీక్షల విరమణ!!
విజయవాడ ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు. భవానీ మాలదారులు నేటి నుంచి భవానీ దీక్షల విరమణ క్రతువు ప్రారంభమైన నేపధ్యంలో భారీ సంఖ్యలో దుర్గమ్మ చెంతకు వస్తున్నారు . పెద్ద ఎత్తున భవానీలు కనక దుర్గమ్మ సన్నిధికి తరలి వస్తున్న క్రమంలో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. జై దుర్గా, జై జై దుర్గా నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతుంది.
ఇవాళ్టి నుంచి ఇంద్రకీలాద్రిలో 5 రోజులపాటు భవాని దీక్షల విరమణలకు ఉదయం ఆలయ అర్చకులు అగ్ని ప్రతిష్టాపన చేశారు. రేపు శత చండీయాగము నిర్వహణ, గిరి ప్రదక్షణ, భవాని దీక్ష విరమణలు ఉంటాయి. గురు భవానీల చేత ఇరుముడులను సమర్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇవాళ్టి నుంచి ఇంద్రకీలాద్రిలో 5 రోజులపాటు భవాని దీక్ష విరమణలు జరగనున్నాయి.

ఈ నెల 7న మహా పూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగియనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీక్షా విరమణలకు ఈ ఐదు రోజుల్లో ఏడు లక్షలమంది భక్తులు వస్తారని ఆలయ అధికారుల అంచనా. ఇరుముడిని దుర్గమ్మకు సమర్పించిన భక్తులు మల్లేశ్వరాలయం మెట్ల మార్గం ద్వారా మల్లికార్జున మహామండప ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హోమగుండాల్లో నేతి కొబ్బరికాయను సమర్పించి గురుస్వామి వద్ద మాల తీయడంతో దీక్ష విరమణ ప్రక్రియ పూర్తవుతుంది
ఈ సందర్భంగా నేటి నుంచి 7 వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్ళింపులు కొనసాగనున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపుకు భారీ, మద్యతరహా రవాణా వాహనాల రాకపోకల మళ్లింపులు ఉంటాయి. ఇబ్రహీంపట్నం నుంచి జి కొండూరు - మైలవరం- నూజివీడు -హనుమాన్ జంక్షన్ వైపుకు వాహనాలు మళ్ళిస్తారు.
విశాఖపట్నం నుండి చెన్నై, చెన్నై నుంచి విశాఖపట్నం వైపుకు భారీ, మద్యతరహా రవాణా వాహనాలను హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ - పామర్రు - అవనిగడ్డ - రేపల్లె- బాపట్ల - చీరాల - త్రోవగుంట - ఒంగోలు జిల్లా మీదుగా మళ్ళిస్తారు. అలాగే గుంటూరు, చెన్నై రహదారి మీదుగా కూడా మళ్లింపులు ఉండనున్నాయి. ప్రయాణికులు ఈ మేరకు సూచనుల పాటించాలని అధికారులు తెలిపారు












Click it and Unblock the Notifications