ఏపీకి మళ్లీ వర్ష సూచన..!!
Vijayawada floods 2024: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో నిన్నటివరకు భారీ వర్షాలు దంచికొట్టాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాలను ముంచివేశాయి. ప్రత్యేకించి- రాజధాని అమరావతి సహా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. సింగ్‌నగర్, చిట్టినగర్, సితార, రాజరాజేశ్వరి పేట, యనమలకుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాలవాసులు వరద నీటిలో కాలం వెళ్లదీస్తోన్నారు.

ఈ పరిస్థితుల్లో ఏపీలో నేడు కూడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షపాతం నమోదుకానుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు వెల్లడించారు.
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, డాక్టర్ అంబేద్కర్ కోనసీమల్లో చెదురుమదురు వర్షాలు పడొచ్చు.
విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏపీఎస్డీఎంఏ అంచనా వేసింది. అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications