జగన్ పై దాడి ఆధారాలిస్తే 2 లక్షలు..! విజయవాడ పోలీసుల ప్రకటన..!
ఏపీలో మేమంతా సిద్దం పేరుతో చేస్తున్న బస్సు యాత్రలో విజయవాడలో సీఎం వైఎస్ జగన్ పై జరిగిన రాళ్ల దాడిపై పోలీసులు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయారు. దీంతో ఇవాళ కీలక ప్రకటన చేశారు. జగన్ పై దాడికి సంబంధించిన ఆధారాలు ఎవరైనా ఇస్తే వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. దీంతో జగన్ పై దాడి విషయంలో జరుగుతున్న విచారణలో పురోగతి లభించవచ్చని భావిస్తున్నారు.

వైఎస్ జగన్ పై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ లో రాళ్ల దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకూ పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించలేదు. కేవలం నలుగురు అనుమానితుల్ని పట్టుకుని విచారిస్తున్నారు. ఇప్పటివరకూ ఒక్కరిని కూడా అరెస్టు చేయలేకపోయారు. దీంతో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. మరోవైపు ఇవాళ సీఎం జగన్ కేసరపల్లి క్యాంపు సైట్ నుంచి బస్సు యాత్ర తిరిగి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పోలీసులపై ఒత్తిడి మరింత పెరిగింది.
దీంతో విజయవాడ పోలీసులు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ కార్యాలయం ఈ ప్రకటన చేసింది. ఇందులో ఈ నెల 13న అజిత్ సింగ్ నగర్లో సీఎం జగన్ పై జరిగిన రాయి దాడికి సంబంధించిన విచారణలో భాగంగా నిందితులను పట్టుకునేందుకు అవసరమైన కచ్చితమైన సమాచారం (సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్స్), వీడియోలను కూడా తమకు అందించవచ్చని పోలీసులు తెలిపారు. అలా అందించిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ఇస్తామని వెల్లడించారు.
అలాగే సీఎం జగన్ పై దాడి కేసుకు సంబంధించిన ఆధారాలు అందించే వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. దాడిపై కచ్చితమైన సమాచారం అందించాలనుకునే వారు డీసీపీ కంచి శ్రీనివాసరావు (9490619342)కు గానీ లేదా టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ హరిబాబు (9440627089)కు గానీ సంప్రదించాలని కోరుతున్నారు. అలాగే నేరుగా నగరంలోని పశువుల ఆస్పత్రి పక్కరోడ్డులో ఉన్న టాస్క్ ఫోర్స్ కమిషనర్ కార్యాలయాన్ని కూడా సంప్రదించవచ్చని తెలిపారు.












Click it and Unblock the Notifications