కీలక నిర్ణయం దిశగా వంగవీటి రాధా : ఆ పార్టీలోకి ఎంట్రీ ఖాయమా..!?
వంగవీటి రాధా రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా. విజయవాడ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా. రానున్న ఎన్నికల కోసం ఏపీలో ఇప్పటికే ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. అందులో భాగంగా.. కీలక నేతలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేసాయి. విజయవాడ నగర పరిధిలోని మూడు స్థానాల్లో గత ఎన్నికల్లో వైసీపీ రెండు స్థానాలు గెలవగా.. టీడీపీ ఒక స్థానంలో గెలిచింది. ఇక, వచ్చే ఎన్నికల్లో టీడీపీ ..జనసేనతో పొత్తుతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. పొత్తు పైన అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ, పొత్తు ఖాయమనే ప్రచారం సాగుతోంది.

జనసేనలోకి వంగవీటి రాధా ..?
ఈ సమయంలోనే జనసేన సీట్ల కోసం ముందస్తు ఒత్తిడి పెంచే క్రమంలో భాగంగా పార్టీలో కీలక చేరికలు.. సీట్ల కేటాయింపు పైన ఫోకస్ చేసింది. దీంతో పాటుగా సీఎం జగన్ సోషల్ ఇంజనీరింగ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో.. జనసేన పార్టీలోకి కీలక నేతలను చేర్చుకోవటం పైన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రాధాను జనసేన తమ పార్టీలోకి ఆహ్వానించింది. కొద్ది రోజుల క్రితం వంగవీటి రాధాతో జనసేన నేత నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఆ సమయంలో మర్యాద పూర్వక భేటీగా చెప్పారు. రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పుకొచ్చారు. కానీ, వంగవీటి రాధా రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుంటున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

పవన్ కళ్యాణ్ తో సత్సంబంధాలు
గతంలో ప్రజారాజ్యం నుంచి రాధా పోటీ చేసారు. ఆ సంబంధాలతో ఇప్పుడు జనసేనలో చేరేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలనేది 2019 ఎన్నికల సమయంలోనూ భావించారు. కానీ, అప్పటికే మల్లాది విష్ణుకు వైసీపీ అధినేత హామీ ఇచ్చారు. టీడీపీలో చేరినా..రాధా ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ వ్యవహారాల్లోనూ రాధా అంత యాక్టివ్ గా ఉండటం లేదు. ఇప్పుడు ఆయన జనసేనలో చేరటం.. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయటం పైన ఖాయమైందని చెబుతున్నారు. టీడీపీతో పొత్తు సంగతి ఎలా ఉన్నా.. జనసేన ఈ సారి తమ వైపు నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది.

టీడీపీ - జనసేన పొత్తు కీలకంగా
త్వరలోనే వంగవీటి రాధా.. జనసేన అధినేత పవన్ సమక్షంలో బహిరంగ సభ లో జనసేన లో చేరుతారని తెలుస్తోంది. టీడీపీ నుంచి విజయవాడ సెంట్రల్ నుంచి బోండా ఉమా ఇంఛార్జ్ గా ఉన్నారు. టీడీపీలో ఉన్నా.. రాధాకు సెంట్రల్ సీటు దక్కే అవకాశం కనిపించటం లేదు. దీంతో..జనసేన నుంచి స్పష్టమైన హామీతో వంగవీటి రాధా వచ్చే ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. అయితే, టీడీపీ -జనసేన మధ్య పొత్తు ఖరారైతే, రాధా టీడీపీలోనే కొనసాగుతారా అనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications