ఏపీలో రేపటి నుంచే పల్లె పండగ.. 3వేల కి.మి సీసీ, 500 కి.మీ తారు రోడ్లే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి(అక్టోబర్ 14) నుంచి పల్లె పండుగ వారోత్సవాలను నిర్వహించేందుకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సిద్ధమైంది. రాష్ట్రంలోని 13,324 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించి, గ్రామీణ అభివృద్ధికి పెద్దపీట వేసేలా అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు.
రూ. 4,500 కోట్ల నిధులతో..
సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరిగే పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా కృష్ణా జిల్లా కంకిపాడులోని ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొంటారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 4,500 కోట్ల నిధులతో 30,000 పనులను చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పనులలో 3,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.

ప్రజల మధ్య సత్సంబంధాలు..
గ్రామాల అభివృద్ధిని ప్రోత్సహించడమే కాకుండా.. గ్రామ ప్రజల మధ్య సత్సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఈ పల్లె పండుగ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారోత్సవాలు బలమైన గ్రామీణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపకల్పనకు పునాది వేస్తుందని భావిస్తున్నారు. గ్రామీణ స్థాయిలో వ్యవసాయ, నీటి, రవాణా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం జరుగుతుందని చెబుతున్నారు. ఇందులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా గ్రామాల్లో ఆర్థిక చలనం వలస కలిగే ప్రయోజనాలను విస్తృత ప్రచారం చేసినట్లవుతుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications