జనం దాడిలో యువకుడి మృతి: యువతిపై అత్యాచారం చేసి చంపేశారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించడంతో ఆమెపై అత్యాచారం చేసి, చంపేశారనే ఉద్దేశంతో స్థానికులు ఇద్దరు యువకులపై దాడి చేశారు. ఈ దాడిలో ఓ యువకుడు మరణించగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పట్టపగలు ఈ సంఘటన గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అడవుల దీవిలో ఆదివారంనాడు చోటు చేసుకుంది.

అడవులదీవి గ్రామానికి చెందిన వేముల శ్రీసాయి(23) బీటెక్‌ విద్యార్థి కాగా, అతని స్నేహితుడు జొన్న పవన్‌కుమార్‌ డిగ్రీ చదువుతున్నాడు. కొంతకాలంగా మహ్మదీయపాలేనికి చెందిన షేక్‌ జాస్మిన్‌ అనే యువతి (19) వెంటపడుతూ ఆమెను వేధిస్తూ వస్తున్నారు. ఇటీవలే జాస్మిన్‌కు వివాహం నిశ్చయమైంది.

కుటుంబసభ్యులు ఆ పనుల మీద మరో ఊరికి వెళ్లారు. ఆ సమయంలో యువతి ఒక్కతే ఇంట్లో ఉంది. ఈ సమయంలో సాయి, పవన్‌లు జాస్మిన్‌ ఇంటికి వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. ఆ తర్వాత క్రికెట్‌ బ్యాట్‌తో, బెల్ట్‌తో కొట్టి చంపి ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించారు.

villagers attacked two youths suspecting their role in rape

ఇంట్లో ఘర్షణ జరుగుతున్న సమయంలో శబ్దాలు విని ఇరుగుపొరుగువారు వచ్చి తలుపు కొట్టినా తీయలేదు. జాస్మిన్‌ చనిపోయిన తర్వాత సాయి, పవన్‌ బయటికి వచ్చి ఆమె ఉరేసుకుందని చెప్పారు. అప్పటికే అక్కడికి చేరుకున్న చుట్టుపక్కలవారు వారిద్దరినీ పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జాస్మిన్‌ మృతదేహాన్ని పరిశీలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

శ్రీసాయి, పవన్‌లే హత్య చేశారని, ఘటనాస్థలంలోనే దొరికిపోయారని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాయి, పవన్‌లను రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సాయి ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందినట్లు అడవులదీవి ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.

ఆస్పత్రిలో ఉన్న పవన్‌ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. కుమారుడిని కోల్పోయిన సాయి కుటుంబసభ్యులు రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. అతడి మృతికి జాస్మిన్‌ కుటుంబసభ్యులు, బంధువులే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నందున ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ జాస్మినే సాయికి ఫోన్‌ చేసిందని, సాయి, పవన్‌ అక్కడికి వెళ్లేటప్పటికే ఆమె చనిపోయిందని వారంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
villagers attacked two youths suspecting their role in rape and murder of a girl in Guntur district of Andhra pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి