విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిక్కు: 60 శాతం మాకే, రాజధానికి 21 గ్రామాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ/గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసమీకరణకు సంబంధఇంచి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో రైతుల అభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన గ్రామసభలు బుధవారం రెండోరోజు అర్థంతరంగా ఆగిపోయాయి. మండలంలో అబిప్రాయ సేకఱణ చేపట్టాల్సిన గ్రామాలు 14 ఉండగా... మంగళవారం తుళ్లూరు, రాయపూడి గ్రామాల్లో, బుధవారం ఉదయం ఆరు గ్రామాలకు సంబంధించి రెండు చోట్ల రెవెన్యూ అధికారులు గ్రామ సభలను నిర్వహించారు. భూసమీకరణ పైన మిశ్రమ స్పందన కనిపిస్తోంది.

రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ పద్ధతిలో మా భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే భూమిని అభివృద్ధి చేసిన తర్వాత 60 శాతం రైతుకు ఇవ్వాలని, ప్రభుత్వం 40 శాతం తీసుకోవాలని, అలాగే, వాణిజ్య అవసరాలకు ఇస్తామంటున్న 100 గజాలు సరిపోదని, కనీసం 200 చదరపు గజాలకు తగ్గకుండా భూమిని ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.

దానికంటే ముందు, గ్రామాల్లో సరిహద్దులకు సంబంధించి నెలకొన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలతో ముందుకొచ్చి నిర్దిష్టమైన గడువు పెట్టి ఆ వ్యవధిలోనే భూములను అభివృద్ధి చేసి ఇస్తామంటే భూ సమీకరణకు భూములు ఇవ్వడం మాకు సమ్మతమేనని తుళ్లూరు మండలంలోని ఆరు గ్రామాల రైతులు స్పష్టం చేశారు.

villages refuse to give land for new AP capital

బుధవారం తొలుత, తుళ్లూరు మండలంలోని నేలపాడులో స్థానిక రైతులతోపాటు శాకమూరు, ఐనవోలు గ్రామాల అన్నదాతలతో సమావేశం నిర్వహించారు. రైతులు చెప్పిన ప్రతి అంశాన్నీ నమోదు చేసుకొన్నారు. రైతులు ప్రధానంగా భూ సమీకరణ తర్వాత అభివృద్ధి చేసిన దానిలో 60శాతం తమకే ఉండాలని పట్టుబట్టారు. భూమి హద్దులకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా సమస్యలు ఉన్నాయని, వాటిని తొలుత పరిష్కరించాలని కోరారు.

భూసమీకరణలో ఎక్కడా ఒక్క గజం భూమి కూడా రైతుకు నష్టం జరగడానికి వీల్లేదన్నారు. వాణిజ్య అవసరాలకు వినియోగించుకొనేందుకు 200 గజాల కంటే ఎక్కువ భూమిని కేటాయించాలన్నారు. రైతుల వాదనలు విన్న ఆర్డీవోలు మురళి, భాస్కర్‌నాయుడు మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి గ్రామానికి ముగ్గురు సర్వేయర్లను నియమిస్తామని చెప్పారు. రైతుకు ఎక్కడా నష్టం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

మధ్యాహ్నం దొండపాడు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం రైతులతో దొండపాడులో అధికారులు సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రాజెక్టులంటే ఏళ్ల తరబడి జాప్యం జరుగుతుంటుందని, భూ సమీకరణలో అలాంటి పరిస్థితికి తావుండరాదని ఈ మూడు గ్రామాల రైతులు అన్నారు. రైతులకు ఇవ్వబోయే ప్యాకేజీని ప్రకటించి భూ సమీకరణ మార్గదర్శకాలను ఖరారు చేయాలని కోరారు. భూమిని అభివృద్ధి చేసి తిరిగి ఇవ్వడంలో జాప్యం జరిగితే రైతు నష్టపోతాడని ఆందోళన వ్యక్తం చేశారు.

మందడం గ్రామంలో కూడా అభిప్రాయ సేకరణ ఏర్పాటు చేసినా అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. తుళ్లూరు మండలంలోని వెలగపూడి, లింగాయపాలెం, మల్కాపురం, మూగలింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెంలో అభిప్రాయ సేకరణ జరపాల్సి ఉంది. వీటితోపాటు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించిన విధంగా మంగళగిరి మండలంలోని నిడమర్రు, నీరుకొండ, కురగల్లులోనూ అభిప్రాయ సేకరణ చేయాల్సి ఉంది.

మోదుగ లింగాయపాలెం రైతులు మాత్రం అధికారుల తీరును నిరసిస్తూ ఆర్‌అండ్‌బీ రహదారిపై గంటపాటు బైఠాయించారు. భూ సమీకరణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించకుండా అభిప్రాయ సేకరణ జరపడంపై అధికారులను నిలదీశారు. గ్రామంలో మావి విలువైన భూములని, వాటిని తీసుకొని ఎక్కడో భూమి ఇస్తామనడం ఏమిటని ప్రశ్నించారు.

కాగా, గుంటూరు జిల్లా అమరావతికి దగ్గరలోని తుళ్లూరు మండలం పరిధిలోకి వచ్చే 21 గ్రామాల్లోనే రాజధానిని నిర్మించాలని ఏపీ సర్కార్‌ భావిస్తోంది. ఇప్పటికే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 17 గ్రామాల పేర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నాలుగు గ్రామాలను కూడా కలిపినట్లు తెలిసింది.

ఇందుకు హరిశ్చంద్రపురం, బోరుపాలెం, లింగయ్యపాలెం, అబ్బరాజుపాలెం, రాయపాడు, దొండపాడు, పిచుకలపాలెం, ఉద్దండరాయుని పాలెం, మోదుగలంక పాలెం, తుళ్లూరు, వడ్డమాను, కొండరాజుపాలెం, మందడం, వెలగపూడి, మల్కాపురం, నేలపాడు, అనంతవరం, వెంకటపాలెం, నెక్కల్లు, శాఖమూరు, అయినవోలు, పెద్దపరిమి గ్రామాల్లో రాజధానిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

దీనిపై ముసాయిదా మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఈ గ్రామాల్లో 30 వేల ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించింది. వీటి పరిధిలోకి వచ్చే ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలను స్థానిక రెవెన్యూ అధికారులకు పంపింది. భూ సమీకరణలో ప్రాథమిక విధులను స్థానిక రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించింది.

English summary
Farmers are divided into two groups over giving up land for the new AP capital in the Tulluru mandal of Guntur district. Farmers of three villages rejected the idea of land pooling, while farmers of three other villages have agreed to land pooling, though with several conditions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X